ధోని ప్రెస్‌ మీట్‌.. ఏం చెప్పనున్నాడు?

12 Sep, 2019 17:50 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచకప్‌ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని మరోసారి హాట్‌ టాపిక్‌గా మారాడు. గురువారం సాయంత్రం ధోని మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాడని సమాచారం. దీంతో తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించేందుకే ప్రెస్‌ మీట్‌ పెడుతున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ధోనిని కీర్తిస్తూ కోహ్లి ట్వీట్‌ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ధోని రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని బీసీసీఐకి తెలిపాడని, దీనిలో భాగంగానే కోహ్లి ట్వీట్‌ చేశాడని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వార్తలను చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కొట్టి పారేశాడు. రిటైర్మెంట్‌ గురించి ధోని తమతో చర్చించలేదని పేర్కొన్నాడు. కాగా, ధోని ప్రెస్‌ మీట్‌పై తమకు ఎలాంటి సమాచారం అందలేదని బీసీసీఐ స్పష్టం చేసింది.  

దీంతో ధోని ప్రెస్‌ మీట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్రికెట్‌ అభిమానులపై ధోని రిటైర్మెంట్‌ బాంబ్‌ పేల్చనున్నాడని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఎలాంటి సంచలన నిర్ణయం ప్రకటించకూడదని ధోని అభిమానులు కోరుకుంటున్నారు. ధోని మరికొంత కాలం క్రికెట్‌ ఆడాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోని.. పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నాడు. అయితే గత కొద్దికాలంగా పేలవ ఫామ్‌తో బ్యాటింగ్‌లో విఫలమవుతున్న ధోనిపై విమర్షల వర్షం కురుస్తోంది. (చదవండి: ‘ధోనితో కలిసి ‘పరుగు’ను మర్చిపోలేను’)

ప్రపంచకప్‌ అనంతరం భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో విశ్రాంతి తీసుకుంటున్నట్లు ధోని తెలిపాడు. ఆర్మీ శిక్షణ పూర్తయిన అనంతరం కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నాడు. అయితే తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేసిన టీ20 జట్టులో ధోనికి అవకాశం కల్పించలేదు. ధోనికి మరికొంత కాలం విశ్రాంతినిస్తున్నట్లు సెలక్టర్లు పేర్కొన్నారు. అయితే విశ్రాంతి పేరుతో కావాలనే పక్కకు పెడుతున్నారని సీనియర్‌ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. ఒక వేళ ధోనిని తప్పించాలనుకుంటే గౌరవంగా అతడికి వీడ్కోలు మ్యాచ్‌ను ఆడించాలని సూచిస్తున్నారు. 
 

>
మరిన్ని వార్తలు