‘అవకాశం ఇచ్చాం.. ఏం చేస్తాడో చూద్దాం’

12 Sep, 2019 20:40 IST|Sakshi

ముంబై : పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్నప్పటికీ టెస్టుల్లో సరైన గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్న టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మకు సువర్ణావకాశం లభించింది. వన్డే, టీ20ల్లో ప్రపంచ శ్రేణి ఓపెనర్‌గా గుర్తింపు పొందిన రోహిత్‌.. టెస్టుల్లో మాత్రం ఇప్పటివరకు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా సరైన గుర్తింపు సాధించలేకపోయాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరీస్‌ కోసం రోహిత్‌ను ఓపెనింగ్‌ కోసం సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ సిరీస్‌తో రోహిత్‌ టెస్టు సత్తా ఏంటో తెలుస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రోహిత్‌ను ఎంపిక చేయడంపై చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణ ఇచ్చాడు. 

‘లాంగ్‌ ఫార్మట్‌ క్రికెట్‌లో రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావించింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా అంతగా రాణించని రోహిత్‌.. ఓపెనర్‌గా తన సత్తా ఏంటో నిరూపించుకుంటాడని భావిస్తున్నాం. వన్డే, టీ20ల్లో ఓపెనర్‌గా రాణిస్తున్నాడు.. ఇప్పటివరకు టెస్టుల్లో రోహిత్‌కు ఓపెనింగ్‌ అవకాశం దక్కలేదు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్‌కు అతడిని ఓపెనర్‌గా ఎంపిక చేశాం. విజయవంతమవుతాడని ఆశిస్తున్నాం. ఇక కేఎల్‌ రాహుల్‌ దారులు మూసుకపోలేదు. అతడు అద్భుత ప్రతిభగల ఆటగాడు. అయితే ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్నాడు. త్వరలోనే తిరిగి జట్టులోకి చేరతాడనే నమ్మకం ఉంది’అంటూ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్నాడు. 

ఇక రోహిత్‌కు టెస్టుల్లో ఓపెనింగ్‌ అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించిన విషయం తెలిసిందే. సౌరవ్‌ గంగూలీ, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ వంటి దిగ్గజాలు కూడా టెస్టుల్లో రోహిత్‌ ఓపెనర్‌గా బరిలోకి దింపాలని, అది టీమిండియాకు ఎంతో లాభిస్తుందని సూచించారు. వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌ దారుణంగా విఫలమవ్వడంతో సెలక్టర్లు ఇదే అవకాశంగా రోహిత్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేశారు. ఇక టెస్టుల్లో ఈ హిట్‌ మ్యాన్‌ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.  

మరిన్ని వార్తలు