ఐపీఎల్ ఫిక్సింగ్‌పై విచారణకు ముద్గల్ కమిటీ

17 May, 2014 00:19 IST|Sakshi
ఐపీఎల్ ఫిక్సింగ్‌పై విచారణకు ముద్గల్ కమిటీ

ఆగస్టులోగా నివేదిక ఇవ్వాలి
 సుప్రీం కోర్టు ఆదేశం
 
 న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్‌లో నెలకొన్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై పూర్తి స్థాయి విచారణకు రిటైర్డ్ జడ్జి ముకుల్ ముద్గల్ కమిటీయే నేతృత్వం వహించనుంది. ఇదే కమిటీ గతంలో తమ ప్రాథమిక విచారణను పూర్తి చేసి సీల్డ్ కవర్‌లో కోర్టుకు అప్పగించింది. దీంట్లో ఎన్.శ్రీనివాసన్‌తో సహా, 12 మంది క్రికెటర్ల పేర్లున్న విషయం తెలిసిందే. సభ్యులుగా ఎల్.నాగేశ్వర్ రావు, నిలయ్ దత్తా కొనసాగనున్నారు. అలాగే ఈ విచారణను ఆగస్టు చివరిలోగా పూర్తి చేసి సీల్డ్ కవర్‌లో అందించాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కమిటీకి సహాయంగా ఐపీఎస్ మాజీ అధికారి బీబీ మిశ్రా ఉండనున్నారు. బీహార్‌లో సంచలనం కలిగించిన గడ్డి కుంభకోణం కేసును దర్యాప్తు చేసిన అనుభవం ఈయనకు ఉంది.
 
 అలాగే ముంబై, చెన్నై, ఢిల్లీల నుంచి ఒక్కో సీనియర్ పోలీస్ అధికారి సేవలు కూడా తీసుకోనున్నారు. అలాగే వీరితో పాటు ఓ మాజీ క్రికెటర్‌ను ముద్గల్, మిశ్రా ఎంపిక చేసుకోనున్నారు. విచారణలో భాగంగా కమిటీకి పరిశోధనా హక్కులతో పాటు సంబంధిత పత్రాలను సీజ్ చేయడం, సాక్ష్యాలను రికార్డు చేసే అధికారం ఉంటుంది. అయితే ఎవరినీ అరెస్ట్ చేసే అధికారం మాత్రం లేదు. విచారణ సాగినంత కాలం ఒక్కో రోజుకు రూ.లక్ష ఇవ్వడంతో పాటు అన్ని ఖర్చులను బీసీసీఐ భరించాల్సి ఉంటుంది.
 
 మరోవైపు ఈ విచారణ కోసం ముద్గల్ కమిటీ కాకుండా కొత్త వారిని నియమించాలన్న బోర్డు విన్నపాన్ని జస్టిస్ ఏకే పట్నాయక్‌తో కూడిన బెంచ్ తోసిపుచ్చింది. నివేదికలో ఉన్న 13 మంది నిందితుల పేర్లను కొత్త వారు చూడడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. వీటితో పాటు తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా గవాస్కర్, శివలాల్ యాదవ్ తమ పదవుల్లో కొనసాగుతారని కోర్టు స్పష్టం చేసింది. ఐసీసీ సమావేశాలకు, బీసీసీఐ ఏజీఎంలకు శ్రీనివాసన్ వెళ్లేందుకు అనుమతించాలన్న వినతిని కోర్టు తిరస్కరించింది.
 
 కోర్టు నిర్ణయం బాగుంది: ఆదిత్య వర్మ
 బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్‌లపై విచారణకు ముద్గల్ కమిటీనే నియమించడంపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిత్య వర్మ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఫిక్సింగ్ విచారణపై పూర్తి అధికారాలను ముద్గల్ కమిటీకి ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పుపై మేం చాలా సంతోషంగా ఉన్నాం’ అని వర్మ చెప్పారు.
 

మరిన్ని వార్తలు