ముంబై అమ్మాయి ‘డబుల్‌’ సంచలనం

6 Nov, 2017 04:04 IST|Sakshi

అండర్‌–19 వన్డే టోర్నీలో జెమీమా రోడ్రిగ్స్‌ అజేయ ద్విశతకం

163 బంతుల్లో 21 ఫోర్లతో 202 నాటౌట్‌  

ముంబై: పదహారేళ్ల ముంబై అమ్మాయి జెమీమా రోడ్రిగ్స్‌ సంచలన బ్యాటింగ్‌తో అజేయ డబుల్‌ సెంచరీ సాధించింది. బీసీసీఐ మహిళల అండర్‌–19 వెస్ట్‌జోన్‌ వన్డే టోర్నీలో భాగంగా సౌరాష్ట్రతో ఔరంగాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ముంబై 285 పరుగులతో జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై తరఫున జెమీమా (163 బంతుల్లో 202 నాటౌట్‌; 21 ఫోర్లు) చెలరేగడంతో ముంబై 50 ఓవర్లలో 2 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత సౌరాష్ట్ర 62 పరుగులకే కుప్పకూలింది. 13 ఏళ్లకే అండర్‌–19 జట్టులోకి వచ్చిన జెమీమా ప్రస్తుతం 16 ఏళ్లకే జట్టు కెప్టెన్‌ అయ్యింది. ఈ టోర్నీలో ఆమెకిది రెండో సెంచరీ కావడం విశేషం. 83 బంతుల్లో సెంచరీని, 162 బంతుల్లో ద్విశతకాన్ని పూర్తిచేసింది. అన్నట్లు ఆమెది హాకీలోనూ అందెవేసిన చేయి! ముంబై అండర్‌–17 హాకీ జట్టు తరఫున మ్యాచ్‌లు కూడా ఆడుతుంది.   

మరిన్ని వార్తలు