కిర్రాక్‌ కిషన్‌...

10 May, 2018 03:45 IST|Sakshi

శివమెత్తిన ముంబై బ్యాట్స్‌మన్‌

21 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 62

సమష్టిగా రాణించిన బౌలర్లు

కోల్‌కతాపై రోహిత్‌ బృందం గెలుపు

ఇషాన్‌ కిషన్‌ కిర్రాకు... కిర్రాకు... పుట్టించాడు. వస్తూనే ‘సిక్సర పిడుగల్లే’ చెలరేగిపోయాడు. ఓ మోస్తరుగా సాగుతున్న ముంబై ఇన్నింగ్స్‌ను భారీషాట్లతో మురిపించాడు. ఉన్నది కాసేపే అయినా ఉరిమే ఉత్సాహంతో బ్యాటింగ్‌ చేశాడు. ముంబైకి భారీ స్కోరు తెచ్చిపెట్టాడు. అనంతరం బంతితో బౌలర్లు కూడా సమష్టిగా రాణించడంతో రోహిత్‌ సేన ఏకపక్ష విజయంతో ‘ప్లే–ఆఫ్‌’ టచ్‌లోకి వచ్చింది.  

 కోల్‌కతా: ముందుకెళ్లాలంటే వెనక్కి చూసుకోకుండా ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిన పరిస్థితి ముంబై ఇండియన్స్‌ది. ఆడేది లీగ్‌ మ్యాచే అయినా ముంబైకిది నాకౌట్‌తో సమానం. ఇలాంటి కీలక తరుణంలో ముంబై 102 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా ఇషాన్‌ కిషన్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగితే... తర్వాత బౌలర్లు సమష్టిగా దెబ్బ తీశారు.

బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగుల భారీస్కోరు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (21 బంతుల్లో 62; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. పీయూష్‌ చావ్లాకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 18.1 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. పాండ్యా బ్రదర్స్‌ కృనాల్, హార్దిక్‌ చెరో 2 వికెట్లు తీశారు.  

ముంబై హోరు...
టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు సూర్యకుమార్‌ యాదవ్‌ (32 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్‌), లూయిస్‌ (13 బంతుల్లో 18; 3 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించాక పీయూష్‌ చావ్లా వేసిన ఆరో ఓవర్లో లూయిస్‌ నిష్క్రమించాడు. తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ జతయ్యాడు. కానీ రన్‌రేట్‌ మాత్రం ఓవర్‌కు ఏడు పరుగులకు మించలేదు. తొమ్మిదో ఓవర్‌ వేసిన చావ్లా మరో ఓపెనర్‌ యాదవ్‌ వికెట్‌ను పడగొట్టాడు. క్రీజులోకి ఇషాన్‌ రాకతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది.

ఒక్కసారిగా పరుగుల వాన మొదలైంది. సారథి ఇచ్చిన అండతో కిషన్‌ భారీ షాట్లకు తెగబడ్డాడు. ఉన్నంతసేపూ... బంతులేసిన బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని తర్వాత హార్దిక్‌ పాండ్యా (13 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగినప్పటికీ చివర్లో కటింగ్‌ (9 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో ముంబై 200 పైచిలుకు పరుగులు చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లు ప్రసి«ద్‌ కృష్ణ, కరన్, నరైన్‌ తలా ఒక వికెట్‌ తీశారు.  

కిషన్‌ తడాఖా...
ఇషాన్‌ కిషన్‌ క్రీజులోకి వచ్చేసరికి ముంబై స్కోరు 9 ఓవర్లలో 62/2. అతను నిష్క్రమించేసరికి 14.4 ఓవర్లలో 144/3. కనీసం ఆరు ఓవర్లు (5.4) కూడా పూర్తిగా క్రీజులో లేని కిషన్‌ అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఇది ముంబై భారీ స్కోరుకు బాటలు వేసింది. ముఖ్యంగా కుల్దీప్‌ యాదవ్‌ను ఊచకోత కోశాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం ఆరు సిక్సర్లుంటే కుల్దీప్‌ బౌలింగ్‌లోనే ఐదు బాదేశాడు.

కుల్దీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో అయితే వరుసగా 6, 6, 6, 6 కొట్టేశాడు. దీంతో మెరుపువేగంతో 17 బంతుల్లోనే ఫిఫ్టీ (5 ఫోర్లు, 4 సిక్సర్లు) పూర్తయింది. మూడో వికెట్‌కు 34 బంతుల్లోనే 82 పరుగులు జోడించాడు. ఎట్టకేలకు అతని మెరుపులకు నరైన్‌ తెరదించాడు. 15వ ఓవర్లో డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో ఉన్న ఉతప్పకు క్యాచ్‌ ఇచ్చి ఇషాన్‌ నిష్క్రమించడంతో కార్తీక్‌ సేన ఊపిరి పీల్చుకుంది.

కోల్‌కతా విలవిల...
కొండంత లక్ష్యాన్ని చూసి బరిలోకి దిగకముందే కోల్‌కతా నీరుగారిపోయినట్లుంది. కనీస పోరాటం అటుంచితే ఆడాల్సిన తీరులో ఆడలేకపోయింది. క్రిస్‌ లిన్, ఉతప్ప, రసెల్, దినేశ్‌ కార్తీక్‌ ఇలా ఎవరు క్రీజులోకి వచ్చినా ముంబై బౌలింగ్‌కు ఎదురొడ్డి కాసేపైనా నిలబడలేకపోయారు. 211 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యం తమ వల్ల కాదన్నట్లు ఆడారు. ఓపెనింగ్‌లో వచ్చి మెరుపులు మెరిపించే సునీల్‌ నరైన్‌ (4) తొలి ఓవర్లోనే ఒక బౌండరీ కొట్టి రెండో బంతికే ఔటయ్యాడు. తర్వాత ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (15 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్‌), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఉతప్ప కలిసి రెండో వికెట్‌కు 28 పరుగులు జోడించిన వెంటనే లిన్‌ లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం ఇదే.

ఆ తర్వాత ఏవరూ ఈ మాత్రం పరుగుల భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు. రెండు సిక్సర్లు బాదిన ఉతప్ప (13 బంతుల్లో 14), తర్వాతి ఓవర్లో రసెల్‌ (2)... పదో ఓవర్లో దినేశ్‌ కార్తీక్‌ (5), నితీశ్‌ రాణా (19 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఔటవ్వడంతో 67 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా పరాభవానికి దగ్గరైంది. అనంతరం వచ్చిన వారిలో కరన్‌ (17 బంతుల్లో 18; 3 ఫోర్లు), పీయూష్‌ చావ్లా (13 బంతుల్లో 11; 1 ఫోర్‌) రెండంకెల స్కోర్లు చేయడంతో జట్టు స్కోరు వంద దాటింది. 108 పరుగుల వద్ద కుల్దీప్‌ యాదవ్‌ (5)ను కృనాల్‌ పాండ్యా ఔట్‌ చేయడంతో కోల్‌ ‘కథ’ముగిసింది. మెక్లీనగన్, బుమ్రా, మార్కండే, కటింగ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) రింకూ సింగ్‌ (బి) చావ్లా 36; లూయిస్‌ (సి) లిన్‌ (బి) చావ్లా 18; రోహిత్‌ శర్మ (సి) ఉతప్ప (బి) ప్రసిధ్‌ కృష్ణ 36; ఇషాన్‌ కిషన్‌ (సి) ఉతప్ప (బి) నరైన్‌ 62; హార్దిక్‌ పాండ్యా (సి) రింకూ సింగ్‌ (బి) కరన్‌ 19; కటింగ్‌ (సి) రసెల్‌ (బి) చావ్లా 24; కృనాల్‌ పాండ్యా నాటౌట్‌ 8; డుమిని నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 210.  

వికెట్ల పతనం: 1–46, 2–62, 3–144, 4–177, 5–178, 6–204.

బౌలింగ్‌: రసెల్‌ 2–0–16–0, ప్రసిధ్‌ కృష్ణ 4–0–41–1, కరన్‌ 3–0–33–1, నరైన్‌ 4–0–27–1, చావ్లా 4–0–48–3, కుల్దీప్‌ యాదవ్‌ 3–0–43–0.  

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: నరైన్‌ (సి) కృనాల్‌ (బి) మెక్లీనగన్‌ 4; లిన్‌ రనౌట్‌ 21; ఉతప్ప (సి) యాదవ్‌ (బి) మార్కండే 14; నితీశ్‌ రాణా (సి) కటింగ్‌ (బి) హార్దిక్‌ 21; రసెల్‌ (సి) మార్కండే (బి) హార్దిక్‌ 2; కార్తీక్‌ రనౌట్‌ 5; రింకూ సింగ్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) బుమ్రా 5; కరన్‌ (సి) డుమిని (బి) కృనాల్‌ 18; చావ్లా (సి) యాదవ్‌ (బి) కటింగ్‌ 11; కుల్దీప్‌ ఎల్బీడబ్ల్యూ (బి) కృనాల్‌ 5; ప్రసిధ్‌ కృష్ణ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.1 ఓవర్లలో ఆలౌట్‌) 108.

వికెట్ల పతనం: 1–4, 2–32, 3–49, 4–54, 5–67, 6–67, 7–76, 8–93, 9–106, 10–108.

బౌలింగ్‌: మెక్లీనగన్‌ 3–0–24–1, కృనాల్‌ పాండ్యా 3.1–0–12–2, బుమ్రా 3–0–17–1, హార్దిక్‌ పాండ్యా 3–0–16–2, మార్కండే 4–0–26–1, కటింగ్‌ 2–0–12–1.  

మరిన్ని వార్తలు