రోహిత్‌ మ్యాజిక్‌

2 May, 2017 07:08 IST|Sakshi
రోహిత్‌ మ్యాజిక్‌

ముంబైని గెలిపించిన నాయకుడు
ఆకట్టుకున్న బట్లర్, రాణా, మెక్లీనగన్‌
బెంగళూరుకు మరో ఓటమి


ముంబై: ముంబై ఇండియన్స్‌ మళ్లీ విజయాల బాట పట్టింది. వరుసగా ఆరు విజయాల అనంతరం తగిలిన షాక్‌ నుంచి త్వరగానే కోలుకున్న రోహిత్‌ సేన తమ చివరి మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో నెగ్గగా.. ఈసారి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చేసింది. ఆఖరి ఓవర్‌ వరకు జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలక ఇన్నింగ్స్‌తో తుదికంటా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. అటు ఇప్పటికే ప్లే ఆఫ్‌ అవకాశాలను కోల్పోయిన కోహ్లి బృందం ఎప్పటిలాగే బ్యాటింగ్‌లో పెద్దగా ప్రభావం చూపకపోగా బౌలర్లు కాస్త రాణించినా ముంబై బ్యాట్స్‌మెన్‌ నిలకడ ముందు నిలవలేకపోయారు.

ఫలితంగా ఐదు వికెట్లతో ముంబై గెలుపొందింది. వాంఖడే మైదానంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. డి విలియర్స్‌ (27 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), పవన్‌నేగి (23 బంతు ల్లో 35; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. మెక్లీనగన్‌కు మూడు, కృనాల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 19.5 ఓవర్లలో ఐదు వికెట్లకు 165 పరుగులు చేసి నెగ్గింది. బట్లర్‌ (21 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు. నేగికి రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రోహిత్‌శర్మకి దక్కింది.

డి విలియర్స్‌ కీలక ఇన్నింగ్స్‌
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు మరోసారి శుభారంభం అందకపోగా.. మూడు ఓవర్ల వ్యవధిలోనే ఓపెనర్లు విరాట్‌ కోహ్లి (14 బంతుల్లో 20; 2 సిక్సర్లు), మన్‌దీప్‌ సింగ్‌ (13 బంతుల్లో 17; 3 ఫోర్లు) వెనుదిరగడంతో 40 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అయితే డి విలియర్స్‌ జట్టు ఇన్నింగ్స్‌ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. బరిలోకి దిగిన ఆరో ఓవర్‌లోనే వరుసగా 4,6తో చెలరేగాడు. కృనాల్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లోనే మరో ఫోర్, సిక్స్‌తో పరుగుల వేగాన్ని పెంచాడు. అయితే కృనాల్‌ తన వరుస రెండు ఓవర్లలో బెంగళూరుకు గట్టి షాకే ఇచ్చాడు. 11వ ఓవర్‌లో హెడ్‌ (15 బంతుల్లో 12; 1 ఫోర్‌)ను, 12వ ఓవర్‌లో ధాటిగా ఆడుతున్న డి విలియర్స్‌ను దెబ్బతీయడంతో ముంబై సంబరాల్లో మునిగింది.

వాట్సన్‌ (3) కూడా స్వల్ప స్కోరుకే అవుట్‌ కావడంతో 108 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టు ఓ మాదిరి స్కోరైనా చేయగలుగుతుందా అనిపించింది.  కానీ చివరి మూడు ఓవర్లలో కేదార్‌ జాదవ్, పవన్‌ నేగి జోడి జట్టును ఆదుకుంది. ముఖ్యంగా నేగి 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదడంతో 15 పరుగులు వచ్చాయి. అయితే చివరి ఓవర్‌లో తడబడిన జట్టు ఆఖరి మూడు బంతుల్లో నేగి, జాదవ్, అరవింద్‌ వికెట్లును కోల్పోయింది. ఆరో వికెట్‌కు జాదవ్, నేగి మధ్య 54 పరుగులు రావడంతో జట్టు స్కోరు 150 పరుగులు దాటగలిగింది.

రోహిత్‌ నిలకడ
ఓ మాదిరి లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబైకి తొలి బంతికే షాక్‌ తగిలింది. అనికేత్‌ బౌలింగ్‌లో ఫామ్‌లో ఉన్న పార్థివ్‌ పుల్‌ షాట్‌ ఆడబోయి డకౌటయ్యాడు. అయితే బట్లర్, నితీశ్‌ రాణా (28 బంతుల్లో 27; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. రెండో ఓవర్‌లో రాణా రెండు ఫోర్లు బాదగా మరుసటి ఓవర్‌లో బట్లర్‌ మూడు ఫోర్లతో చెలరేగాడు. అయితే జోరు మీదున్న ఈ జోడిని పవన్‌ నేగి పెవిలియన్‌కు పంపాడు. 8వ ఓవర్‌లో బట్లర్‌ను అవుట్‌ చేయగా రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తన మరుసటి ఓవర్‌లో నితీష్‌ భారీ షాట్‌ ఆడబోయి బౌండరీ వద్ద క్యాచ్‌ అవుటయ్యాడు.

దీంతో జట్టు 70 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. పొలార్డ్‌ (13 బంతుల్లో 17; 2 ఫోర్లు) కొద్దిసేపే క్రీజులో నిలిచాడు. కృనాల్‌ (2 రిటైర్డ్‌ హర్ట్‌) తానెదుర్కొన్న రెండో బంతికే సింగిల్‌ తీసే క్రమంలో త్రో బాల్‌ తగిలి మైదానం వీడాడు. ఇక చివరి 12 బంతుల్లో 18 పరుగులు కావాల్సిన దశలో రోహిత్‌ ఓ సిక్స్‌ బాది ఒత్తిడి తగ్గించడంతో పాటు 34 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. చివరి ఓవర్లో ఏడు పరుగులు అవసరం కాగా మరో బంతి మిగిలి ఉండగానే మ్యాచ్‌ గెలిచింది.

>
మరిన్ని వార్తలు