బెంగళూరు కథ కంచికే! 

16 Apr, 2019 00:54 IST|Sakshi

లీగ్‌లో ఏడో పరాజయం

ముంబై ఇండియన్స్‌ గెలుపు  

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అందరికంటే ముందే క్వాలిఫయర్స్‌ రేసులోకి వచ్చిన జట్టు చెన్నై అయితే... అందరికంటే ముందే నిష్క్రమిస్తున్న జట్టు బెంగళూరు. ఇరు జట్లకి ‘ఒకటే’ తేడా. అది ఏంటంటే సూపర్‌కింగ్స్‌ ‘ఒకటి’ ఓడి ఏడు గెలిచింది. రాయల్‌ చాలెంజర్స్‌ మాత్రం ‘ఒకటి’ గెలిచి ఏడు ఓడింది. దీంతో ఇంకా ఆరు మ్యాచ్‌లు మిగిలున్నా... బెంగళూరు ముందుకెళ్లే దారులు దాదాపు మూసుకుపోయాయి. సోమవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై విజయం సాధించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. డివిలియర్స్‌ (75; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మొయిన్‌ అలీ (50; 1 ఫోర్, 5 సిక్స్‌లు) రాణించారు.  తర్వాత ముంబై 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి గెలిచింది. హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 37 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. చహల్, మొయిన్‌ అలీ చెరో 2 వికెట్లు తీశారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు... మొదట కోహ్లి (8)ని, తర్వాత పార్థివ్‌ (28) వికెట్లను కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 49/2. ఈ దశలో డివిలియర్స్‌కు జతయిన మొయిన్‌ అలీ సిక్సర్లతో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో వికెట్‌కు 10.1 ఓవర్లలోనే ఇద్దరు కలిసి చకచకా 95 పరుగులు జోడించారు. డివిలియర్స్‌ 49 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అలీ 31 బంతుల్లో (1 ఫోర్, 5 సిక్సర్లు) అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. అనంతరం మలింగ... అలీతో పాటు స్టొయినిస్‌ (0)లను ఒకే ఓవర్లో ఔట్‌ చేశాడు. దీంతో బెంగళూరు మరిన్ని పరుగులు చేయలేకపోయింది. 

4.1 ఓవర్లలో ముంబై స్కోరు 50... 
లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఓపెనర్లు డికాక్‌ 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (28; 2 ఫోర్లు, 2  సిక్స్‌లు) చెలరేగారు. దీంతో జట్టు 4.1 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. వీళ్లిద్దరు పరుగు తేడాతో 71 స్కోరు వద్ద నిష్క్రమించారు. తర్వాత వచ్చిన సూర్యకుమార్‌ (29; 2 ఫోర్లు, 1 సిక్స్‌), ఇషాన్‌ కిషన్‌ (9 బంతుల్లో 21; 3 సిక్సర్లు) ధాటిని కొనసాగించారు. దీంతో ముంబై లక్ష్యం దిశగా సాగింది. ఆఖర్లో బంతులకు, పరుగులకు మధ్య అంతరం పెరగడంతో హార్దిక్‌ పాండ్యా బ్యాట్‌ ఝళిపించాడు. పవన్‌ నేగి వేసిన 19వ ఓవర్లో అతను వరుసగా 6, 4, 4, 6తో 22 పరుగులు చేయడంతో మరో ఓవర్‌ మిగిలుండగానే ముంబై లక్ష్యాన్ని అధిగమించింది.  

ఐపీఎల్‌లో నేడు
పంజాబ్‌(vs)రాజస్తాన్‌
వేదిక: మొహాలి, రాత్రి గం.8 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

మరిన్ని వార్తలు