రోహిత్ సేన గెలిస్తేనే..

21 May, 2016 16:47 IST|Sakshi
రోహిత్ సేన గెలిస్తేనే..

కాన్పూర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్ లో లీగ్ మ్యాచ్ లు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇక ప్రతీ జట్టు తమ ఆఖరి మ్యాచ్ ను మాత్రమే ఆడాల్సి ఉన్న తరుణంలో  ప్లే ఆఫ్  రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ జట్లు దాదాపు ప్లే ఆఫ్ బెర్తు ఖరారు చేసుకున్న పరిస్థితుల్లో, ఇంకా రెండు బెర్తులకు నాలుగు జట్ల నుంచి ప్రధాన పోటీ ఏర్పడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ లు తలో ఏడు మ్యాచ్ ల్లో గెలిచి ప్లే ఆఫ్  రేసు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

 

తమ చివరి మ్యాచ్ లో భాగంగా ముంబై ఇండియన్స్-గుజరాత్ లయన్స్ జట్ల మధ్య శనివారం గ్రీన్ పార్క్ స్టేడియంలో రాత్రి గం.8.00లకు కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ గెలిస్తేనే ప్లే ఆఫ్ బెర్తుపై ఆశలు పెట్టుకోవచ్చు. కాని పక్షంలో లీగ్ దశతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మరోవైపు గుజరాత్ విజయంతో లీగ్ దశను ముగించి ప్లే ఆఫ్ బెర్తుపు నిశ్చితంగా ఉండాలని భావిస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.


గుజరాత్ జట్టుకు  అరోన్ ఫించ్ తో పాటు, సురేష్ రైనా, బ్రెండన్ మెకల్లమ్, డ్వేన్ బ్రేవో, డ్వేన్ స్మిత్ లు ప్రధాన బలంగా కాగా, ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, కోరీ అండర్సన్, కీరోన్ పొలార్డ్, కృనాల్ పాండ్యాలపైనే ఆధారపడే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో అటు బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ సమిష్టగా రాణించిన జట్టుకు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఘనవిజయం తర్వాత ఆరు రోజుల విశ్రాంతి ముంబైకు లభించడంతో ఎటువంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ మ్చాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు ఉంటాయనే విషయం తెలుసు కాబట్టి ముంబై సర్వశక్తులు ఒడ్డుతుందనడంలో ఎటువంటి  సందేహం లేదు. టాస్ కీలకంగా మారే అవకాశం ఉంది. తొలుత టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు