పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి

15 Apr, 2019 04:45 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌ 
సొంత మైదానంలో ముంబై ఇండియన్స్‌ జట్టు గత మ్యాచ్‌లో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొంది. పాయింట్ల పట్టికలో రాజస్తాన్‌ రాయల్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు చివరి స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లను మిగతా జట్లు ఓడిస్తాయని భావించవచ్చు. అయితే ఈ పొట్టి ఫార్మాట్‌లో ఏదైనా జరిగే అవకాశముంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న జట్లు తమదైన రోజున ఎంతటి మేటి జట్లనైనా మట్టి కరిపిస్తాయి. ఎట్టకేలకు ఏడో మ్యాచ్‌లో గెలిచి బోణీ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మరిన్ని విజయాలపై దృష్టి పెడుతుంది. అయితే బెంగళూరు బౌలర్లలో యజువేంద్ర చహల్‌ మినహా మిగతా బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు.

వారు తమ పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. తమ స్థానం సుస్థిరంగా ఉందని ఆ జట్టులోని కొందరు భావిస్తున్నారు. ఐపీఎల్‌ ప్రదర్శన జాతీయ జట్టు ఎంపికలో లెక్కలోకి తీసుకోబోరని తెలుసుకాబట్టి వారి ఆటలోనూ పురోగతి కనిపించడం లేదు. గత మ్యాచ్‌లో ఎదురైన ఓటమిని మర్చిపోయి మళ్లీ విజయాలబాట పట్టాలని ముంబై ఇండియన్స్‌ పట్టుదలగా ఉంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను హార్దిక్‌ పాండ్యాకు ఇచ్చి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఊహించని పొరపాటు చేశాడు. హార్దిక్‌ పాండ్యాకు మధ్య ఓవర్లలో బౌలింగ్‌ ఇస్తే సబబుగా ఉండేది. తొలి విజయాన్ని ఆస్వాదించిన బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లోనూ అలాంటి ఫలితమే రుచి చూడాలని అనుకుంటుందనడంలో సందేహం లేదు. 

మరిన్ని వార్తలు