రాణించిన రాయుడు, తివారీ

13 May, 2017 22:38 IST|Sakshi
రాణించిన రాయుడు, తివారీ

కోల్ కతా: ఈడెన్ గార్డెన్స్ లో ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న చివరి లీగ్ మ్యాచులో ముంబై యువ ఆటగాళ్లు సౌరభ్ తివారి, అంబటి రాయుడులు మినహా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో ముంబై, కోల్ కతాకు సాధారణ లక్ష్యాన్ని నిర్ధేశించింది.  అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సిమన్స్ బౌల్ట్ బౌలింగ్ లో డక్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ, సౌరభ్ తివారితో కలిసి ఆచితూచి నెమ్మదిగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే సరికి ముంబై స్కోరు 51/1 చేయగలిగింది.

ఈ తరుణంలో రోహిత్ శర్మ(27)ను రాజ్ పుత్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన అంబటి రాయుడు, సౌరభ్ తో వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 9 ఫోర్లతో 42 బంతుల్లో సౌరభ్ అర్థశతకం సాధించాడు. వీరిద్దరూ క్రీజులో కుదురుకుంటున్న సమయంలో ఉమేశ్ వేసిన 17 ఓవర్లో లేని పరుగు ప్రయత్నించిన సౌరభ్ తివారీ రనౌటయ్యాడు. అయినా రాయుడు బ్యాటింగ్ లో వేగం తగ్గకుండా ఆడటంతో 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాయుడు(63)  కుల్దీప్ యాదవ్ వేసిన 19 ఓవర్లో వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టి మరుసటి బంతికి స్టంప్ అవుటయ్యాడు. చివరి ఓవర్లో బోల్ట్ 5 పరుగులిచ్చి పోలార్డ్(13) అవుట్ చేయడంతో ముంబై 5 వికెట్లు కోల్పోయి173 పరుగులు చేయగలిగింది. ఇక కోల్ కతా బౌలర్ల లో బోల్ట్ కు రెండు వికెట్లు పడగా కుల్డీప్ యాదవ్, రాజ్ పుత్ లకు చెరో వికెట్ లభించింది.

మరిన్ని వార్తలు