ముంబై మెరిసె...

17 Apr, 2017 01:06 IST|Sakshi
ముంబై మెరిసె...

వరుసగా నాలుగో విజయం
6 వికెట్ల తేడాతో ఓడిన గుజరాత్‌  


ముంబై: సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ జట్టు అదరగొట్టింది. ఈ సీజన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని సాధించి తనకు ఎదురులేదని నిరూపించుకుంది. ఆదివారం వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గుజరాత్‌ లయన్స్‌ జట్టును చిత్తుగా ఓడించింది. ముందుగా గుజరాత్‌ లయన్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. బ్రెండన్‌ మెకల్లమ్‌ (44 బంతుల్లో 64; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా... దినేశ్‌ కార్తీక్‌ (26 బంతుల్లో 48 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. అనంతరం ముంబై ఇండియన్స్‌ జట్టు 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 177 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నితీశ్‌ రాణా (36 బంతుల్లో 53; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (29 బంతుల్లో 40 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), పొలార్డ్‌ (23 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు.

నిలబెట్టిన భాగస్వామ్యాలు
గుజరాత్‌ లయన్స్‌కు ఆరంభంలోనే మెక్లీనగన్‌ షాకిచ్చాడు. ఇన్నింగ్స్‌ మూడో బంతికే డ్వేన్‌ స్మిత్‌ (0)ను పెవిలియన్‌కు పం పాడు. అయితే మలింగ వరుస ఓవర్లలో రైనా (29 బంతుల్లో 28; 2 ఫోర్లు) రెండు బౌండరీలు... మెకల్లమ్‌ రెండు సిక్సర్లు బాదడంతో పవర్‌ప్లేలో గుజరాత్‌ 46 పరుగుల్ని సాధించింది. ఈ దశలో ముంబై స్పిన్నర్లు హర్భజన్, కృనాల్‌ పాండ్యాలు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఈ జంటను నియంత్రించారు. స్పిన్‌ ఆడటంలో ఇబ్బంది పడిన రైనా చివరకు హర్భజన్‌ బౌలింగ్‌లోనే రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 65 బంతుల్లో 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్రమంలో 36 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న మెకల్లమ్‌ తర్వాత జోరు పెంచాడు. బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్‌తో పాటు, మలింగ వేసిన 14వ ఓవర్‌ మూడో బంతిని బౌండరీకి తరలించి, తర్వాతి బంతికే అవుటయ్యాడు. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్, దినేశ్‌ కార్తీక్‌ 24 బంతుల్లో 54 పరుగుల్ని జోడించారు. చివర్లో జేసన్‌ రాయ్‌ (7 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్‌) వేగంగా ఆడటంతో  గుజరాత్‌ మంచి స్కోరును సాధించింది.

అలవోకగా ఛేదన...
వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న ముంబై ఇండియన్స్‌ 177 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. పరుగుల ఖాతా మొదలు పెట్టకుండానే ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌ (0) వికెట్‌ను కోల్పోయిన ముంబై తర్వాత ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. రెండో ఓవర్లోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న నితీశ్‌ రాణా ఆ తర్వాత బట్లర్‌ (24 బంతుల్లో 26; 1 ఫోర్‌ , 2 సిక్సర్లు)తో కలిసి వేగంగా పరుగుల్ని జోడించాడు. 54 బంతుల్లో 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక ఏడు పరుగుల వ్యవధిలో వీరిద్దరూ అవుటయ్యారు. ఈ దశలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పొలార్డ్‌ వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ముంబైని లక్ష్యానికి చేరువ చేశారు. చివర్లో పొలార్డ్‌ అవుటైనా హార్దిక్‌ పాండ్యాతో కలిసి రోహిత్‌ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు.

‘కిట్‌’ లేక ఆటకు దూరం!
గత మ్యాచ్‌లో రాణించిన గుజరాత్‌ ఆటగాడు ఆరోన్‌ ఫించ్‌ ఈసారి బరిలోకి దిగలేదు. అతను తన కిట్‌ను పోగొట్టుకోవడమే అందుకు కారణమని కెప్టెన్‌ రైనా చెప్పడం విశేషం. ప్రధాన బ్యాట్స్‌మన్‌ ఇలా కిట్‌ కోసం మ్యాచ్‌ వదిలేసుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించినా... వ్యక్తిగత స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాల్లో ఉన్న నిబంధనలు ఫించ్‌ను మరో లేబుల్‌ ఉన్న బ్యాట్‌ వాడకుండా అడ్డుకొని ఉండవచ్చు.

ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ & కోల్‌కతా
వేదిక: న్యూఢిల్లీ, సా.గం. 4.00 నుంచి
హైదరాబాద్‌ & పంజాబ్‌
వేదిక: హైదరాబాద్, రాత్రి .గం. 8.00 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు