ముంబై బతికిపోయింది

17 May, 2018 01:34 IST|Sakshi
పొలార్డ్‌ ,రాహుల్‌

ఉత్కంఠ పోరులో   పంజాబ్‌పై విజయం

3 పరుగులతో ఓడిన  కింగ్స్‌ ఎలెవన్‌

రాహుల్‌ అద్భుత ప్రదర్శన వృథా 

బుమ్రా 3/15  

పంజాబ్‌ విజయానికి 10 బంతుల్లో 20 పరుగులు రావాలి...అద్భుతంగా చెలరేగిపోతున్న లోకేశ్‌ రాహుల్‌ క్రీజ్‌లో ఉండటంతో లక్ష్యం సునాయాసంగా ఛేదించేలా కనిపించింది. అయితే బుమ్రా వేసిన మ్యాజిక్‌ బాల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ముగించింది. మిగిలిన 9 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసిన పంజాబ్‌ చతికిలపడింది... ఓడితే లీగ్‌ నుంచి నిష్క్రమించే స్థితిలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు ఊపిరి పోసింది. పది రోజుల క్రితం 95 పరుగులు చేసి కూడా రాజస్తాన్‌పై జట్టును గెలిపించలేకపోయిన రాహుల్‌ ఈసారి 94 పరుగులతో ఓటమి పక్షాన నిలిచి కన్నీళ్ల పర్యంతం కాగా... ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవంగా నిలబెట్టుకొని రోహిత్‌ సేన సంబరపడింది. పొలార్డ్‌ కీలక బ్యాటింగ్‌కు తోడు బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్‌ ముంబై ఇండియన్స్‌కు కీలక విజయాన్ని అందించాయి.   

ముంబై: ఐపీఎల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు అదృష్టం మళ్లీ కలిసొచ్చింది. ఓటమికి చేరువగా వచ్చి కూడా ఆ జట్టు సొంతగడ్డపై విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 3 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను ఓడించింది. ముందుగా ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (23 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, కృనాల్‌ పాండ్యా (23 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. ఆండ్రూ టై (4/16) చక్కటి బౌలింగ్‌ ప్రదర్శన కనబర్చాడు. అనంతరం పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది. లోకేశ్‌ రాహుల్‌ (60 బంతుల్లో 94; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ కోల్పోగా, ఆరోన్‌ ఫించ్‌ (35 బంతుల్లో 46; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి.  

మెరుపు భాగస్వామ్యం... 
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (15 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి శుభారంభం అందించాడు. ముఖ్యంగా రాజ్‌పుత్‌ వేసిన మూడో ఓవర్లో అతను 2 సిక్సర్లు, 2 ఫోర్లతో చెలరేగిపోవడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. మరో ఎండ్‌లో తన తొలి బంతికే ఎవిన్‌ లూయీస్‌ (9)ను ఔట్‌ చేసి ఆండ్రూ టై పంజాబ్‌కు మొదటి వికెట్‌ అందించినా... మోహిత్‌ వేసిన తర్వాతి ఓవర్లో ఇషాన్‌ కిషన్‌ (12 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఒక ఫోర్, వరుసగా 2 సిక్సర్లు బాదడంతో ముంబై ఖాతాలో 18 పరుగులు చేరాయి. అయితే టై వరుస బంతుల్లో వీరిద్దరిని వెనక్కి పంపి ముంబైని దెబ్బ తీశాడు. ఆ తర్వాత రాజ్‌పుత్‌ బౌలింగ్‌లో వెనుదిరిగిన రోహిత్‌ శర్మ (6) లీగ్‌లో తన వైఫల్యాన్ని కొనసాగించాడు. పంజాబ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఒక దశలో ముంబై వరుసగా 29 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. 10 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు 79 పరుగులకు చేరింది. సరిగ్గా ఈ సమయంలో వాంఖెడే మైదానంలో రెండు ఫ్లడ్‌లైట్లు పని చేయకపోవడంతో కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగింది. మ్యాచ్‌ మళ్లీ మొదలయ్యాక ముంబై ఇన్నింగ్స్‌కు కొత్త వెలుగు వచ్చింది. స్టొయినిస్‌ ఓవర్లో కృనాల్‌  6, 6, 4తో చెలరేగగా... రాజ్‌పుత్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌ వరుసగా 6, 4, 4 బాది తన పవర్‌ను ప్రదర్శించాడు. స్టొయినిస్‌ తర్వాతి ఓవర్లో కృనాల్‌ వెనుదిరిగినా... ఏమాత్రం తగ్గని పొలార్డ్‌ అదే ఓవర్లో మళ్లీ 4, 4, 6తో సత్తా చాటాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే సీజన్‌లో తొలి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కృనాల్, పొలార్డ్‌ 36 బంతుల్లోనే 65 పరుగులు జోడించడం విశేషం. ఎట్టకేలకు పొలార్డ్‌ను ఔట్‌ చేసి అశ్విన్‌ ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అతను వెనుదిరిగాక ముంబై ఆఖరి 27 బంతుల్లో ఒక సిక్స్, 2 ఫోర్ల సహాయంతో 34 పరుగులు మాత్రమే చేయగలిగింది.  

సెంచరీ భాగస్వామ్యం... 
ఛేదనను నెమ్మదిగా ప్రారంభించిన పంజాబ్‌ తొలి 2 ఓవర్లలో 9 పరుగులే చేసింది. అయితే హార్దిక్‌ పాండ్యా వేసిన మూడో ఓవర్లో గేల్‌ సిక్స్, ఫోర్‌... రాహుల్‌ 2 ఫోర్లు బాదడంతో జోరు పెరిగింది. అయితే గేల్‌ (11 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్‌)ను బౌన్సర్‌తో ఔట్‌ చేసి మెక్లీనగన్‌ వాంఖెడే అభిమానుల్లో ఆనందం నింపాడు. అయితే రాహుల్, ఫించ్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. పవర్‌ప్లే తర్వాత ముంబై చక్కటి బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను కొద్దిసేపు నియంత్రించింది. ఫలితంగా తర్వాతి ఆరు ఓవర్లలో 42 పరుగులే వచ్చాయి. అయితే 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్న అనంతరం రాహుల్‌ దూకుడు పెంచాడు. మార్కండే ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో పంజాబ్‌ విజయావకాశాలు పెంచాడు. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఫించ్‌ వెనుదిరగడంతో 111 పరుగుల (74 బంతుల్లో) రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. అదే ఓవర్లో స్టొయినిస్‌ (1) కూడా వెనుదిరిగాడు. కటింగ్‌ వేసిన తర్వాతి ఓవర్లో రాహుల్‌ 3 ఫోర్లు కొట్టడంతో మొత్తం 15 పరుగులు లభించాయి. అయితే బుమ్రా వేసిన 19వ ఓవర్‌ మూడో బంతికి రాహుల్‌ ఔట్‌ కావడంతో పంజాబ్‌ ఆశలు గల్లంతయ్యాయి.    

మరిన్ని వార్తలు