నాలుగేళ్ల తరువాత తొలి ఐపీఎల్ మ్యాచ్

17 Apr, 2017 17:41 IST|Sakshi
నాలుగేళ్ల తరువాత తొలి ఐపీఎల్ మ్యాచ్

ముంబై:దాదాపు నాలుగేళ్ల పాటు ఒక లీగ్ కు దూరంగా ఉండి పునరాగమనం చేయడమంటే అంత తేలికైన విషయం కాదు. అయితే భారత మాజీ పేస్ బౌలర్ మునాఫ్ పటేల్ నాలుగేళ్ల తరువాత తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆదివారం వాంఖేడ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా గుజరాత్ లయన్స్ తరపున మునాఫ్ బరిలోకి దిగాడు. ఇలా సుదీర్ఘ విరామం తరువాత ఆడటం చాలా అరుదుగా జరుగుతుంది. కాగా, మునాఫ్ పటేల్ పై నమ్మకం ఉంచిన గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా తుది జట్టులోకి తీసుకున్నాడు. దాంతో పాటు మునాఫ్ చేత పూర్తి కోటా బౌలింగ్ కూడా వేయించాడు. నిన్నటి మ్యాచ్ లో నాలుగు ఓవర్ల బౌలింగ్ వేసిన మునాఫ్ 35 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు.

 

ముంబై ఇండియన్స్ ఓపెనర్ జాస్ బట్లర్ వికెట్ మునాఫ్ ఖాతాలో చేరింది. 1426 రోజుల తరువాత తొలి మ్యాచ్ ఆడినప్పటికీ మునాఫ్ చక్కటి రిథమ్ తో బౌలింగ్ చేయడం ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ కు ముందు మునాఫ్ చివరి సారి 2013లో ఆడాడు. అప్పుడు ముంబై ఇండియన్స్ తరపున మునాఫ్ పాల్గొన్నాడు. చెన్నై కింగ్స్ తో జరిగిన ఆ మ్యాచ్ లో మునాఫ్ మూడు ఓవర్లు వేసి వికెట్ తీయకుండా 32 పరుగులిచ్చాడు. అప్పటి మ్యాచ్ లో మునాఫ్ బౌలింగ్ ను చితక్కొట్టిన వారిలో రైనా ఒకడు. ఇప్పుడ  అదే రైనా జట్టులో మునాఫ్ తిరిగి ఆడటం ఇక్కడ విశేషం.

మరిన్ని వార్తలు