విజయ్‌ శంకర్‌ గాయం నిజమేనా?

2 Jul, 2019 13:33 IST|Sakshi
విజయ్‌ శంకర్‌

న్యూఢిల్లీ : టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ శంకర్‌ గాయం నిజమేనా? లేక గాయం సాకుతో ఉద్దేశపూర్వకంగా తప్పించారా? ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా నడుస్తున్న చర్చ. ఎడమ కాలు బొటన వేలి గాయం కారణంగా విజయ్‌ శంకర్‌ అర్థాంతరంగా వరల్డ్‌ కప్‌ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అతని స్థానంలో టెస్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ను భారత మేనేజ్‌మెంట్‌ ఎంపిక చేసింది. అయితే శంకర్‌ గాయంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.

జూన్‌ 19న నెట్‌ ప్రాక్టీస్‌లో బుమ్రా వేసిన యార్కర్‌తో విజయ్‌ కాలి బొటనవేలికి గాయమైంది. అయితే ఆ తర్వాత పెద్దగా ఇబ్బంది అనిపించకపోవడంతో భారత్‌ ఆడిన తర్వాత రెండు మ్యాచ్‌లలో (అఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌లతో) అతను బరిలోకి దిగాడు. ఇప్పుడిదే అనుమానాలు రేకిత్తిస్తుంది. టీమ్‌మేనేజ్‌ మెంట్‌ మాత్రం గాయం తిరగబెట్టడంతోనే శంకర్‌ ఇంగ్లండ్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడని, సీటీ స్కాన్‌ అనంతరం శంకర్‌ బొటన వేలికి ఫ్రాక్చర్‌ అయినట్లుగా తేలిందని పేర్కొంది. గాయం నుంచి కోలుకునేందుకు కనీసం మూడు వారాల సమయం పడుతుందని, దాంతో అతను వరల్డ్‌ కప్‌ నుంచి తప్పుకుంటున్నాడని ప్రకటించింది. అయితే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత ఆటగాళ్లకు శంకర్‌ డ్రింక్స్‌ అందించాడు. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పరుగెత్తాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్‌ మురళీ కార్తిక్‌ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించాడు.

‘ఒకరోజు ముందు జట్టులో ఉన్నాడు. బ్యాటింగ్‌ బాగానే చేశాడు. దురదృష్టవశాత్తు ఓ మంచి బంతికి ఔటయ్యాడు. నిన్న(ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా) గాయంతోనే చక్కగా పరుగెత్తుతూ డ్రింక్స్‌ అందించాడు. నేడు టోర్నీ నుంచి నిష్క్రమించాడు. వెంటనే మరొకరు భర్తీ అయ్యారు. దీంతో నేనొక్కడినే అయోమయానికి గురైనట్టున్నా?’ అని సెటైరిక్‌ ట్వీట్‌తో పెద్దబాంబు పేల్చాడు. మురళీ వాదనను ఏకీభవిస్తూ అభిమానులు కూడా బీసీసీఐని నిలదీస్తున్నారు. ‘గాయంతో అడుగు తీసి, అడుగు వేయ‌లేని స్థితిలో ఉన్నాడ‌నే కదా విజ‌య్ శంక‌ర్‌ను తప్పించారు? మరి ఆ స్థితిలో ఉన్న ఆట‌గాడితో డ్రింక్స్‌ను ఎలా తెప్పించుకున్నారు? అని ప్రశ్నిస్తున్నారు.

చదవండి : విజయ్‌ శంకర్‌ ఆట ముగిసింది 

మరిన్ని వార్తలు