మురళీ విజయ్‌ దూకుడు

1 Dec, 2018 12:17 IST|Sakshi

సిడ్నీ: టీమిండియా-క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్ల మధ్య జరిగిన నాలుగురోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. శనివారం చివరి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 43.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది.  ఈ రోజు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత జట్టు దూకుడుగా ఆడింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌లు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించిన తర్వాత హాఫ్‌ సెంచరీ సాధించిన రాహుల్‌(62) ఔటయ్యాడు.

ఆపై హనుమ విహారీతో కలిసి విజయ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే మురళీ విజయ్‌ సెంచరీ సాధించాడు. టీ20 ఫార్మాట్‌ తరహాలో బ్యాట్‌ను ఝుళిపిస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  తొలి హాఫ్‌ సెంచరీ సాధించడానికి 91 బంతులు ఆడిన విజయ్‌.. అటు తర్వాత మరింత రెచ‍్చిపోయిఆడాడు. హాఫ్‌ సెంచరీని సెంచరీగా మలుచుకోవడానికి కేవలం 27బంతులు మాత్రమే తీసుకున్నాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగి ఆడాడు.మొత్తంగా 132 బంతులను ఎదుర్కొన్న విజయ్‌.. 16 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 129 పరుగులు సాధించాడు.  మురళీ విజయ్‌ ఔటైన తర్వాత మ్యాచ్‌ ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు