అద్భుతంగా ఆడిన బంగ్లా

11 Mar, 2018 00:17 IST|Sakshi
ముష్ఫికర్‌

చెలరేగిన ముష్ఫికర్, లిటన్‌  

శ్రీలంకపై భారీ లక్ష్య ఛేదన

 అయిదు వికెట్లతో గెలుపు 

బంతిని ఎక్కడ వేయాలో పాలుపోని బౌలర్లు... 
వంతులవారీ హిట్టింగ్‌ అందుకున్న బ్యాట్స్‌మెన్‌... 
అచ్చమైన టి20 మ్యాచ్‌ను తలపించిన ఆటతీరు... 
ఓవర్‌కు పదికి తగ్గకుండా పరుగుల ప్రవాహం... 
పోటాపోటీగా ఆడి లంకపై బంగ్లా జయభేరి... 
మొత్తమ్మీద అభిమానులకు మజామజా... 

కొలంబో: సాదాసీదాగా, చప్పగా సాగుతున్న నిదహస్‌ ముక్కోణపు టి20 టోర్నీలో ఓ మెరుపు మ్యాచ్‌. బ్యాట్స్‌మెన్‌ విజృంభణతో ప్రేక్షకులకు కనువిందు. ఫోర్లు, సిక్సర్ల హోరుతో మోతెక్కిన స్టేడియం. శనివారం ఇక్కడ జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ముష్ఫికర్‌ రహీమ్‌ (35 బంతుల్లో 72 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), లిటన్‌ దాస్‌ (19 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల వీరోచిత ఆటతో ఆతిథ్య శ్రీలంకపై బంగ్లాదేశ్‌ తమ జట్టు చరిత్రలో రికార్డు ఛేదన నమోదు చేసింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్‌ను ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ (30 బంతుల్లో 57; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధాటిగా మొదలుపెట్టగా, మధ్యలో కుశాల్‌ పెరీరా (48 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుతో నిలబెట్టాడు. చివర్లో తరంగ (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్‌) తనవంతు బాధ్యత పోషించాడు. దీంతో ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్‌ (3/48) వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులిచ్చాడు. మహ్ముదుల్లా (2/15) మాత్రమే ప్రత్యర్థిని కొంత కట్టడి చేయగలిగాడు. ఛేదనను బంగ్లా దీటుగా ఆరంభించింది. అనూహ్యంగా ఓపెనర్‌గా వచ్చిన లిటన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగగా, తమీమ్‌ ఇక్బాల్‌ (29 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అతడికి అండగా నిలిచాడు. ముష్ఫికర్‌ ఒత్తిడిని చిత్తుచేస్తూ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో 19.4 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి బంగ్లా 215 పరుగులు చేసి విజయాన్నందుకుంది. లంక బౌలర్లలో నువాన్‌ ప్రదీప్‌ (2/37) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం టోర్నీలో మూడు జట్లు ఒక్కో గెలుపుతో సమంగా ఉన్నాయి. సోమవారం జరిగే మ్యాచ్‌లో భారత్‌ శ్రీలంకతో తలపడుతుంది. 

పరుగు‘లంక’.. 
లంకకు ఓపెనర్లు గుణతిలక (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కుశాల్‌ మెండిస్‌ అదిరే ఆరంభాన్నిచ్చారు. వీరి జోరుతో 4వ ఓవర్లోనే జట్టు స్కోరు 50 దాటింది. వెంటనే గుణతిలక అవుటైనా, బంగ్లాకు కుశాల్‌ పెరీరా రూపంలో పెనుముప్పు ఎదురైంది. మొదట అతడు కుదురుకునేందుకు యత్నించడంతో పవర్‌ ప్లే అనంతరం మూడు ఓవర్లలో 16 పరుగులే వచ్చాయి. పదో ఓవర్‌ నుంచి ఇద్దరూ జోరు పెంచారు. ప్రత్యర్థి బౌలర్లు పదేపదే షార్ట్‌ పిచ్‌ బంతులేస్తూ గతి తప్పడంతో ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డారు. 26 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్న మెండిస్‌... మహ్ముదుల్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు. హిట్టర్‌గా వచ్చిన షనక (0) రెండు బంతుల వ్యవధిలో అవుటయ్యాడు. మరుసటి ఓవర్లో పెరీరా అర్ధ శతకం (34 బంతుల్లో) పూర్తిచేసుకోగా చివరి బంతికి కెప్టెన్‌ చండిమాల్‌ (2) క్యాచ్‌ ఇచ్చాడు. ఈ దశలో తరంగ, పెరీరా బ్యాట్‌ ఝళిపించారు. 25 బంతుల్లోనే 55 పరుగులు జత చేశారు. చివరి ఓవర్లో కుశాల్, తిసార (0)లను ముస్తఫిజుర్‌ పెవిలియన్‌కు పంపినా 16 పరుగులిచ్చాడు. ప్రధాన బౌలర్లు తస్కిన్‌ అహ్మద్, రూబెల్‌ హుస్సేన్, మెహదీ హసన్‌ భారీగా పరుగులివ్వడంతో కెప్టెన్‌ మహ్ముదుల్లా బౌలింగ్‌కు దిగాల్సి వచ్చింది. బంగ్లా తరఫున మొత్తం ఏడుగురు ఆటగాళ్లు బౌలింగ్‌ చేయడం విశేషం. 

లిటన్‌ చితక్కొట్టెన్‌... ముష్ఫికర్‌ ముగించెన్‌ 
బంగ్లా ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్‌ టాప్‌ స్కోరరే అయినా... లిటన్‌ ఆట కూడా హైలైట్‌గా నిలిచింది. తామెప్పుడూ ఛేదించనంత లక్ష్యాన్ని అందుకోగలమని అతడు  జట్టులో ఆత్మవిశ్వాసం నింపాడు. రెగ్యులర్‌ ఓపెనర్‌ సౌమ్య సర్కార్‌ను కాదని తనను ముందుగా పంపిన అవకాశాన్ని లిటన్‌ సద్వినియోగం చేసుకున్నాడు. లంక బౌలర్లపై విరుచుకుపడి పరుగులు సాధించాడు. ఓపెనర్లు ఎక్కడా తగ్గకపోవడంతో తొలి ఓవర్‌ నుంచే బంగ్లా 10 రన్‌రేట్‌తో పరుగులు చేసింది. లిటన్‌ వికెట్‌ కోల్పోయినా పవర్‌ ప్లే పూర్తయ్యేసరికి 74/1తో నిలిచింది. అప్పటికీ జోరు కొనసాగించిన తమీమ్‌ను తిసార పెరీరా తన బౌలింగ్‌లోనే క్యాచ్‌ పట్టి పెవిలియన్‌ చేర్చాడు. సౌమ్య సర్కార్‌ (22 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడలేకపోయాడు. కెప్టెన్‌ మçహ్ముదుల్లా (20; 1 ఫోర్, 1 సిక్స్‌), షబ్బీర్‌ రెహ్మాన్‌ (0) వెంటవెంటనే అవుటైనా, చేయాల్సిన పరుగుల కంటే బంతులు తక్కువగా ఉన్నా ముష్ఫికర్‌ బెరుకు లేకుండా ఆడాడు. చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... నాలుగు బంతుల్లోనే లాంఛనాన్ని ముగించాడు.  

మరిన్ని వార్తలు