అన్ని క్రికెట్ సంఘాలు అమలు చేయాల్సిందే..

3 May, 2016 00:48 IST|Sakshi

లోధా ప్యానెల్ ప్రతిపాదనలపై సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని క్రికెట్ సంఘాలు తప్పనిసరిగా జస్టిస్ ఆర్‌ఎం లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలు అమలు చేయాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ‘ఒకసారి బీసీసీఐ వీటిని అమలు చేస్తే ఇక అన్ని రాష్ట్ర సంఘాలు కూడా ఇదే పద్దతి అనుసరిస్తాయి. మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో ఏర్పాటైన ఈ కమిటీని ఆషామాషీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని అంశాలను నిశితంగా గమనించి నిపుణు లైన కమిటీ సభ్యులు చేసిన సూచనలివి. వీటిని కేవలం ప్రతిపాదనలే అనే కోణంలో చూడకూడదు’ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ స్పష్టం చేశారు.

అంతకుముందు లోధా ప్యానెల్ సూచనలు ఆమోదయోగ్యం కాదని హర్యానా క్రికెట్ సంఘం చేసిన అభ్యంతరాలపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు గరిష్ట వయస్సు ప్రతిపాదనపై కూడా కర్ణాటక క్రికెట్ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్యానెల్ సూచనలు కొన్ని అమలు పరిచే విధంగానే ఉన్నా కొన్ని మాత్రం ఆమోదయోగ్యంగా లేవని పేర్కొంది.

మరిన్ని వార్తలు