చిక్కుల్లో బౌలర్ ముస్తాఫిజుర్

24 Apr, 2016 17:49 IST|Sakshi
చిక్కుల్లో బౌలర్ ముస్తాఫిజుర్

హైదరాబాద్: సత్ఖీరా పట్టణం.. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉండే అదే పేరున్న జిల్లా కేంద్రం. అక్కడ పేదవాళ్లుండే కాలనీలో ఓ చిరు ఉద్యోగి తన భార్య, ఆరుగురు సంతానంతో నివసించాడు. అతనికి క్రికెట్ అంటే పిచ్చి. అతని చిన్నకొడుక్కైతే ప్రాణం. ఇద్దరూ క్రికెట్ నే ప్రేమించారు. ఆరాధించారు. నాన్నను ఇంప్రెస్ చెయ్యటంకోసం.. వికెట్లంత ఎత్తు పెరగకముందే బౌలింగ్ మొదలుపెట్టాడా బుడ్డోడు. పెరిగి.. 5అడుగుల 11 అంగులాల ఎత్తయ్యాడు. పేరు ముస్తాఫిజుర్ రహమాన్. క్రికెట్ మోజులోపడి అతను చదువును నిర్లక్ష్యం చేశాడు. అదే ఇప్పుడతన్ని గొప్ప చిక్కుల్లో పడేసింది.

ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని బౌలర్ గా మంచిపేరు తెచ్చుకున్నాడు ముస్తాఫిజుర్. అరంగేట్రం చేసిన టెస్ట్, వన్ డే మ్యాచ్ ల్లో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. 2015 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోన్న ముస్తాఫిజులు ఈ ఏడాది ప్రారంభంలో గాయాలపాలై కొన్నిరోజులు ఆటకు దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్ వేదికగా చెలరేగిపోతున్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫన ఆడుతోన్న ముస్తాఫిజుర్ ఇప్పుడో గొప్ప చిక్కుల్లో పడ్డాడు. ఇన్నాళ్లంటే బంగ్లాదేశీ జట్టే కాబట్టి బెంగాలీలో మాట్లాడేవాడు. ఇప్పుడు.. కలగూరగంపలా దేశానికొకరుచొప్పున, ప్రాంతానికి ఇద్దరు చొప్పున కలిసి జట్టుగా ఏర్పడే ఐపీఎల్ లో ఆడుతున్న ముస్తాఫిజుర్ తీవ్రమైన భాషా సమస్యను ఎదుర్కొంటున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ లో పడిపోయి చదువును అలక్ష్యంచేసిన అతనికి అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ పదిముక్కలైనా రాదు. దీంతో సహచరులతో ఐడియాలు పంచుకోవాలన్నా, ప్రెజెంటేషన్ సెర్మనీల్లో మాట్లాడాలన్నా వెనకడుగు వేస్తున్నాడు.

ఇదే విషయాన్ని శనివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్  అనంతరం హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్ ఇరగదీస్థాడు కానీ భాషే అతని సమస్య అని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆసియా ఆటగాళ్లు భాషా సమస్యను ఎదుర్కోవడం సహజమే. వీరేంద్ర సెహవాగ్, భజ్జీ, చాలా మంది పాకిస్థాన్ ఆటగాళ్లు ఇలాంటి ఇబ్బందులు పడ్డవారే. క్రమంగా ఇంగ్లీష్ పై పట్టుపెంచుకుని, అనర్గళంగా మాట్లాడటమేకాక, కామెంటేటర్లుగానూ మారారు అందులో కొందరు. సో.. ముస్తాఫిజుర్.. నీక్కూడా ఆల్ ది బెస్ట్. స్పీక్ వెల్..

మరిన్ని వార్తలు