ముస్తాఫిజుర్ ఫిట్‌గా ఉంటే..

3 Jun, 2016 17:28 IST|Sakshi
ముస్తాఫిజుర్ ఫిట్‌గా ఉంటే..

ఢాకా: తమ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడాలనుకుంటే నిరభ్యంతరంగా పాల్గొనవచ్చని బంగ్లాదేశ్ క్రికెట్ కోచ్ చందికా హతురసింగా స్పష్టం చేశారు.  ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆడి జట్టు టైటిల్ సాధించడంలో సహకరించిన ముస్తాఫిజుర్ ఫిట్‌గా ఉంటే ఇంగ్లిష్ కౌంటీలో ఆడేందుకు వెళ్లవచ్చని తెలిపారు. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో బంగ్లాదేశ్ పర్యటించనున్న నేపథ్యంలో ముస్తాఫిజుర్ ముందుగా అక్కడ ఆడటం వల్ల  తమ దేశ క్రికెట్‌కు  మేలు జరిగే అవకాశం  ఉందన్నారు. బంగ్లా క్రికెటర్లకు అరుదుగా వచ్చే ఇటువంటి అవకాశాన్ని ముస్తాఫిజుర్ వినియోగించుకోవచ్చన్నారు.

'ఇంగ్లండ్ లో ఆడితే అక్కడ పరిస్థితులపై అవగాహన వస్తుంది. ఒకవేళ అక్కడికి వెళ్లకపోతే, ఆ పరిస్థితులు తెలియవు. ఇంగ్లిష్ కౌంటీలో ఆడాలనుకుంటే ముస్తాఫిజుర్ ఆడవచ్చు. ఫిట్నెస్ ను పరీక్షించుకున్న తరువాత కౌంటీల్లో ఆడే విషయంపై నిర్ణయం తీసుకోవచ్చు' అని చందికా తెలిపారు. ఐపీఎల్లో తనదైన ముద్ర వేసిన ముస్తాఫిజుర్ ఇంగ్లిష్ కౌంటీ సస్సెక్స్ తరపున ఆడనున్నట్లు ఇటీవల వార్తలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు