బీసీసీఐపై మురళీధరన్ మండిపాటు

14 Jul, 2016 13:24 IST|Sakshi
బీసీసీఐపై మురళీధరన్ మండిపాటు

న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తనకు రెండున్నర కోట్ల రూపాయలు(4 లక్షల డాలర్లు) చెల్లించాల్సి ఉందని శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తెలిపాడు. తమ దేశానికి చెందిన మహేల జయవర్ధనేకు రూ. 3 కోట్లు ఇవాల్సి ఉందని వెల్లడించాడు. గతేడాది గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ మొత్తానికి దూరమైన టీమిండియా ప్రధాన పేసర్ మొహ్మద్ షమీకి రూ.2 కోట్ల, 23 లక్షల పరిహారాన్ని బీసీసీఐ అంజేసింది.

ఈ నేపథ్యంలో తమకు కూడా పరిహారం ఇవ్వాలని కొచ్చి టస్కర్స్ టీమ్ సభ్యులు కోరుతున్నారు. 'షమీకి బీసీసీఐ పరిహారం ఇచ్చింది. అవకాశముంటే కొచ్చి టస్కర్స్ ఆటగాళ్లకు కూడా పరిహారం ఇవ్వాల'ని ఈ జట్టు తరపున ఆడిన ఆస్ట్రేలియ క్రికెటర్ బ్రాడ్ హొడ్జ్ ట్విట్టర్ ద్వారా కోరాడు. దీని గురించి పలుమార్లు బీసీసీఐ అడిగినా ఫలితం లేకపోయిందని మురళీధరన్ చెప్పాడు. తాను చాలా లీగ్లు ఆడానని, బీసీసీఐ మాదిరిగా ఏ బోర్డు వ్యవహరించలేదని విమర్శించాడు. ఆటగాళ్లతో పాటు బోర్డు కూడా కాంట్రాక్టును గౌరవించాల్సిన అవసరముందన్నాడు.

ఈ వ్యవహారం కోర్టులో ఉందని, సమస్య పరిష్కారమైన తర్వాతే ఆటగాళ్లు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. వీవీఎస్ లక్ష్మణ్‌, రవీంద్ర జడేజా కూడా కొచ్చి టస్కర్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు