రోహిత్‌ బ్యాట్‌ సౌండ్‌.. నాకు తొలి జ్ఞాపకం!

4 May, 2020 16:19 IST|Sakshi
రోహిత్‌ శర్మ(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్లలో ఆసీస్‌ స్పీడ్‌ స్టార్‌ బ్రెట్‌ లీ ఒకడని టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ స్పష్టం చేయగా.. రోహిత్‌తో తనకు ఎదురైన తొలి జ్ఞాపకాన్ని బ్రెట్‌ లీ గుర్తు చేసుకున్నాడు. అదే సమయంలో రోహిత్‌ లాంటి హార్డ్‌ హిట్టర్‌కు బౌలింగ్‌ చేయడానికి ఇష్టపడనని బ్రెట్‌ లీ చెప్పుకొచ్చాడు. ‘రోహిత్‌ చాలా దూకుడైన క్రికెటర్‌. ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకున్నాడంటే ఆపడం కష్టం. ఆరంభం నుంచి ఉతకడం ఆరంభిస్తాడు. రోహిత్‌ తరహా క్రికెటర్లకు నేను ఎప్పుడూ బౌలింగ్‌  చేయాలని అనుకోను. నాకు రోహిత్‌తో ఒక మంచి జ్ఞాపకం ఉంది. అది రోహిత్‌తో నా తొలి మెమొరీ అనే చెబుతా. నా బౌలింగ్‌లో రోహిత్‌ షాట్‌ ఆడగా బ్యాట్‌ నుంచి వచ్చిన సౌండ్‌  అదిరిపోయింది. ఆ సౌండ్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. అది నాకు ఇప్పటికీ జ్ఞాపకమే’ అని బ్రెట్‌లీ తెలిపాడు. (అతని రీఎంట్రీ ఖాయం.. బెట్‌ వేస్తా: రాయుడు)

అంతకుముందు బ్రెట్‌ లీ గురించి రోహిత్‌ శర్మ ఆసక్తికర  వ్యాఖ్యలు చేశాడు. తాను బ్రెట్‌ లీ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి నిద్రలేని రాత్రులు గడిపేవాడినని పేర్కొన్నాడు. ప్రధానంగా తన అరంగేట్రం ఏడాది(2007) ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు బ్రెట్‌ లీ వేగం చూసి బెదిరిపోయానని రోహిత్‌ తెలిపాడు. బ్రెట్‌ నుంచి 150కి.మీ వేగంతో వచ్చే బంతుల్ని ఎలా ఆడాలి అనే విషయంలో చాలా సందిగ్థతకు లోనయ్యేవాడినని రోహిత్‌ పేర్కొన్నాడు. అదే సమయంలో దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ బౌలింగ్‌ను పేస్‌ చేయడం కూడా ఆందోళనకు గురి చేసేదన్నాడు. స్టెయిన్‌ వేసే ఇన్‌స్వింగర్లు, ఔట్‌ స్వింగర్లు, కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులు ఆడటం చాలా కష్టంగా అనిపించేదన్నాడు. తన ఫేవరెట్‌ బౌలర్ల విషయానికొస్తే ఆసీస్‌ పేసర్‌ హజల్‌వుడ్‌, దక్షిణాఫ్రికా పేసర్‌ రబడాలే ముందు వరుసలో ఉంటారన్నాడు. 

>
మరిన్ని వార్తలు