ఒలింపిక్ పతకమే నా లక్ష్యం

22 Apr, 2016 00:49 IST|Sakshi
ఒలింపిక్ పతకమే నా లక్ష్యం

జిమ్నాస్ట్ దీపా కర్మాకర్
 
న్యూఢిల్లీ: క్రీడాకారులెవరైనా కెరీర్‌ను ప్రారంభించే ముందు ఆయా రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరాలని... ఒలింపిక్స్‌లో పోటీపడాలని కలలు కంటుంటారు. అయితే ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ జిమ్నాస్టిక్స్‌లో భారత్ నుంచి ఇప్పటిదాకా అసాధ్యమనుకున్న ఫీట్‌ను సాధ్యం చేసిన దీపా కర్మాకర్ మాత్రం ఈ కేటగిరీలోకి రాదు. తాను చిన్నప్పటి నుంచే ఒలింపిక్స్‌లో అడుగు పెట్టాలని భావిం చింది. అనుకున్నది సాధించడమే కాకుండా దేశం నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గానూ నిలిచింది. ఈ నేపథ్యంలో రియో డి జనీరోలో జరిగిన క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొని స్వదేశానికి చేరుకున్న దీపకు ఘనస్వాగతం లభించింది. ‘ఏదో ఓ రోజు నేను ఒలింపిక్స్‌లో పోటీ పడి దేశానికి గౌరవం తీసుకురావాలని కలలు కన్నాను.

నిజానికి కెరీర్ ఆరంభం నుంచే ఈ కోరిక నాలో పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు నిజంగానే నేను ఒలింపిక్స్‌కు అర్హత సాధించాను. ఇక ఇప్పుడు గతంకన్నా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంది. రియో గేమ్స్‌లో పతకం సాధిస్తాననే భావిస్తున్నాను. దీనికోసం శాయశక్తులా ప్రయత్నించి చరిత్ర సృష్టించాలని అనుకుంటున్నాను.

ఇప్పుడిదే నా లక్ష్యం’ అని 22 ఏళ్ల దీప తెలి పింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని అనుకున్నా, ఐదో స్థానం లో నిలిచానని చెప్పింది. అయితే ఇటీవల క్వాలిఫయింగ్ టోర్నీలో ఆమె 52.698 పాయింట్లు సాధించి ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా వచ్చిన తాజా గుర్తింపుతో తానేమీ స్టార్ అథ్లెట్‌గా భావించడం లేదని, తన గురి అంతా పతకంపైనే ఉందని స్పష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు