రెచ్చిపోతారనుకుంటే.. తడబడుతున్నారు!

22 Jun, 2019 17:25 IST|Sakshi

సౌతాంప్టన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా రెచ్చిపోవడం ఖాయమని సగటు క్రీడాభిమాని ఊహించుకుని ఉంటాడు. అయితే మ్యాచ్‌ ఆరంభమైన తర్వాత మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. భారత జట్టు కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకుని కుదురుకోవడానికి ఆపసోపాలు పడుతోంది.  135 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి బ్యాటింగ్‌లో తడబాటుకు గురైంది. భారత్‌ కోల్పోయిన తొలి నాలుగు వికెట్లలో రోహిత్‌ శర్మ(1), కేఎల్‌ రాహుల్‌(30), విజయ్‌ శంకర్‌(29), విరాట్‌ కోహ్లి(67)లు ఉన్నారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. రోహిత్‌ శర్మ పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. దాంతో భారత్‌ 7 పరుగుల వద్ద తొలి  వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో రాహుల్‌కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ 57 పరుగులు సాధించిన తర్వాత రాహుల్‌ అనవసరపు షాట్‌కు యత్నించి రెండో వికెట్‌గా ఔటయ్యాడు. అప్పుడు కోహ్లి-విజయ్‌ శంకర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది యత్నం చేసింది. ఈ జోడి 58 పరుగుల జత చేసిన తర్వాత విజయ్‌ శంకర్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. ఫలితంగా 122 పరుగుల వద్ద భారత్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరో 13 పరుగుల వ్యవధిలో కోహ్లి సైతం ఔట్‌ కావడంతో భారత్‌ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఇక మిగతా వారు సాధ్యమైనంత వరకూ క్రీజ్‌లో ఉండి స్టైక్‌ రోటేట్‌ చేస్తేనే భారత్‌ పోరాడే లక్ష్యాన్ని అఫ్గాన్‌ ముందు ఉంచకల్గుతుంది. 36 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.


 

మరిన్ని వార్తలు