నదీమ్‌ వచ్చేశాడు.. మరి ఆడతాడా?

18 Oct, 2019 20:15 IST|Sakshi

రాంచీ:  ఇటీవల వెస్టిండీస్‌-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విశేషంగా రాణించిన టీమిండియా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షహ్‌బాజ్‌ నదీమ్‌.. దక్షిణాఫ్రికాతో చివరి టెస్టులో భాగంగా భారత జట్టులో చోటు కల్పించారు. గతంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకోలేని నదీమ్‌ ఎట్టకేలకు టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ భుజం నొప్పి గాయంతో బాధపడుతూ ఉండటంతో అతని స్థానంలో నదీమ్‌ అవకాశం కల్పించారు. తనకు భుజం నొప్పి ఎక్కువగా ఉందని కుల్దీప్‌ స్పష్టం చేయడంతో నదీమ్‌ను తీసుకున్నారు.

ఇప్పటివరకూ భారత సీనియర్‌ జట్టు తరఫున ఆడని నదీమ్‌ శనివారం నుంచి ఆరంభం కానున్న టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేయాలని భావిస్తున్నాడు. రేపటి తుది జట్టులో ఇషాంత్‌ శర్మ స్థానంలో కుల్దీప్‌ను ఆడించాలనే యోచనలో టీమిండియా యాజమాన్యం ఉంది. రాంచీ పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఇషాంత్‌ను పక్కకు పెట్టి కుల్దీప్‌కు చోటు కల్పించాలనుకున్నారు. కాగా, కుల్దీప్‌ గాయంతో బాధపడుతుండటంతో  నదీమ్‌నే తమ మరో స్పిన్‌ ఆప్షన్‌గా టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఎంచుకుంది.

జూలై-ఆగస్టు నెలల్లో వెస్టిండీస్‌-ఏతో అనధికారిక సిరీస్‌లో భాగంగా భారత-ఏ జట్టు తరఫున నదీమ్‌ తన స్పిన్‌ మ్యాజిక్‌తో ఆకర్షించాడు. తొలి టెస్టులో మొత్తంగా 10 వికెట్లతో మెరిసిన నదీమ్‌.. మూడో టెస్టులో ఐదు వికెట్లు సాధించాడు. అదే భారత జట్టులో ఎంపికకు మార్గం సుగమం చేసింది. మరి రేపటి నుంచి ఆరంభం కానున్న టెస్టులో ఈ బిహార్‌ బౌలర్‌ ఆడతాడో.. లేదో చూడాలి.

మరిన్ని వార్తలు