నాల్గో భారత బౌలర్‌గా ఘనత

21 Oct, 2019 11:38 IST|Sakshi

రాంచీ: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మ్యాచ్‌ ద్వారా టీమిండియా జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న స్పిన్నర్‌ షహ్‌బాజ్‌ నదీమ్‌ అరుదైన జాబితాలో చేరిపోయాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా సోమవారం మూడో రోజు ఆటలో బావుమా(32)ను ఔట్‌ చేయడం ద్వారా నదీమ్‌ తొలి అంతర్జాతీయ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. నదీమ్‌ వేసిన 29 ఓవర్‌ రెండో బంతిని ముందుకొచ్చి ఆడబోయిన బావుమాను సాహా స్టంప్‌ ఔట్‌ చేశాడు. ఫలితంగా స్టంపింగ్‌ ద్వారా తొలి అంతర్జాతీయ వికెట్‌గా దక్కించుకున్న నాల్గో టీమిండియా బౌలర్‌గా నదీమ్‌ గుర్తింపు పొందాడు. అంతకుముందు ఈ జాబితాలో డబ్యూవీ రామన్‌, ఎమ్‌ వెంకట్రమణ, ఆశిష్‌ కపూర్‌లు ఉన్నారు. ఇప్పుడు వారి సరసన నదీమ్‌ చేరాడు.

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఎదురీదుతోంది. లంచ్‌ సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో డుప్లెసిస్‌(1) ఆరంభంలోనే పెవిలియన్‌ చేరగా, ఆపై హమ్జా- బావుమాల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేసింది. కాగా, ఈ జోడి 91 పరుగులు జత చేసిన తర్వాత హమ్జాను జడేజా బోల్తా కొట్టించాడు. తన కెరీర్‌లో తొలి హాఫ్‌ సెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న హమ్జాను జడేజా బౌల్డ్‌ చేశాడు. దాంతో 107 పరుగుల వద్ద సఫారీలు నాల్గో వికెట్‌ను కోల్పోయారు. అదే స్కోరు వద్ద బావుమాను నదీమ్‌ ఔట్‌ చేశాడు. మరో 12 పరుగుల వ్యవధిలో హెన్రిచ్‌ క్లాసెన్‌(6)ను జడేజా బౌల్డ్‌ చేయడంతో దక్షిణాఫ్రికా 119 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా కోల్పోయిన ఆరు వికెట్లలో ఉమేశ్‌ యాదవ్‌, జడేజాలు తలో రెండు వికెట్లు సాధించగా, షమీ, నదీమ్‌లు చెరో వికెట్‌ తీశారు. ఇంకా సఫారీలు 368 పరుగుల వెనుకబడ్డారు.

మరిన్ని వార్తలు