శభాష్‌ నదీమ్‌

21 Sep, 2018 01:04 IST|Sakshi

10 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ 

దేశవాళీ వన్డేల్లో కొత్త ప్రపంచ రికార్డు ∙జార్ఖండ్‌ బౌలర్‌ షాబాజ్‌ నదీమ్‌ ఘనత 

చెన్నై: జార్ఖండ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ సంచలన బౌలింగ్‌ (10–4–10–8) ప్రదర్శనతో సత్తా చాటాడు. లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌ (అంతర్జాతీయ, దేశవాళీ వన్డేలు కలిపి)లో అత్యుత్తమ గణాంకాలతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. గురువారం విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నదీమ్‌ 10 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు (హ్యాట్రిక్‌ సహా) పడగొట్టాడు. ఈ క్రమంలో ఇరవై ఏళ్ల క్రితం ఢిల్లీ బౌలర్‌ రాహుల్‌ సంఘ్వీ (8/15) హిమాచల్‌ ప్రదేశ్‌పై నెలకొల్పిన రికార్డును అతను బద్దలు కొట్టాడు. నదీమ్‌ ధాటికి రాజస్తాన్‌ 73 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో తొలి 8 వికెట్లూ నదీమ్‌ ఖాతాలోకే వెళ్లాయి. ఇందులో 5 క్లీన్‌బౌల్డ్‌లు, ఒక ఎల్బీడబ్ల్యూ ఉండటం మరో విశేషం. ఈ క్రమంలో అతను ‘హ్యాట్రిక్‌’ కూడా నమోదు చేయడం ఇంకో ప్రత్యేకత. తన ఆరో ఓవర్‌ చివరి రెండు బంతులకు వికెట్లు తీసిన అతను, తర్వాతి ఓవర్‌ తొలి బంతికే మరో వికెట్‌ పడగొట్టాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌లో చివరి 2 వికెట్లు మరో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అనుకూల్‌ రాయ్‌కు దక్కాయి. అప్పటి వరకు ఐదు ఓవర్ల పాటు సాధారణంగా బౌలింగ్‌ చేసిన అనుకూల్‌కు ఈ పిచ్‌పై ఎలా బౌలింగ్‌ చేయాలో, ఎలా వేగం పెంచాలో సీనియర్‌గా నదీమ్‌ తగు సూచనిలిచ్చాడు. ఆ తర్వాతే అతనికి వికెట్లు దక్కాయని తన రికార్డు అనంతరం నదీమ్‌ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్‌ రికార్డు చమిందా వాస్‌ (8/19) పేరిట ఉంది.  

29 ఏళ్ల నదీమ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌ వయసు 14 ఏళ్ళు కావడం విశేషం. దేశవాళీ క్రికెట్‌లో 2004 నుంచి నిలకడగా రాణిస్తూ 99 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 375 వికెట్లు తీసినా దురదృష్టవశాత్తూ భారత జట్టులో ఎంపికకు మాత్రం అతను ఎప్పుడూ చేరువకాలేదు. ఐపీఎల్‌లో అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఆడాడు. ఇటీవల భారత్‌ ‘ఎ’ తరఫున విశే షంగా రాణించిన అతను, ఆసియా కప్‌లో భారత జట్టుకు నెట్‌ ప్రాక్టీస్‌లో బౌలింగ్‌ చేశాడు. ‘ఎ’ జట్టు ప్రదర్శనతో పాటు తాజా రికార్డు వెస్టిండీస్‌తో సిరీస్‌కు అవకాశం కల్పిస్తుందని నదీమ్‌ ఆశిస్తున్నాడు.

పది వికెట్లు పడగొడితే ఇంకా బాగుండేది. కానీ దేనికైనా రాసిపెట్టి ఉండాలి కాబట్టి ప్రస్తుతానికి చాలా సంతోషం. అనుకూల్‌ నా రికార్డును దెబ్బ తీశాడని భావించడం లేదు.  ఒక సీనియర్‌గా అతడికి మార్గనిర్దేశనం చేయడం నా బాధ్యతగా భావించా. మ్యాచ్‌ తర్వాత జట్టు సహచరులు అతడిని ఆట పట్టించారు కూడా. అయితే చివరకు జట్టు విజయమే ముఖ్యం. 

మరిన్ని వార్తలు