క్రికెట్‌లో సంచలనం, ఫస్ట్ బాల్‌కే విన్‌!!

24 Nov, 2017 17:18 IST|Sakshi

సాక్షి, గుంటూరు: దేశీయ క్రికెట్‌లో సంచలనం చోటు చేసుకుంది. తొలి బంతికే ఓ జట్టు విజయం సాధించింది. శుక్రవారం గుంటూరులోని జేకేసీ కాలేజీ మైదానంలో జరిగిన మహిళల అండర్‌-19 క్రికెట్‌ వన్డే లీగ్‌, నాకౌట్‌ టోర్నమెంట్‌ మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది. నాగాలాండ్‌ జట్టుపై కేరళ టీమ్‌ మొదటి బంతికే విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన నాగాలాండ్‌ జట్టు 17 ఓవర్లు ఆడి కేవలం 2 పరుగులకే ఆలౌటైంది. ఇందులో ఒక పరుగు వెడ్‌ ద్వారా రావడం విశేషం. ఓపెనర్‌ మేనక 18 బంతులు ఆడి మరొక పరుగు సాధించింది. తొమ్మిది మంది డకౌటయ్యారు. కేరళ కెప్టెన్‌ మిన్ను మణి నాలుగు ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 4 వికెట్లు పడగొట్టింది.

మూడు పరుగుల లక్ష్యంతో తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేరళ టీమ్‌ తొలి బంతికే ఫోర్‌ కొట్టి సంచలన విజయం సాధించింది. తమ జట్టు అద్భుత విజయం సాధించడం పట్ల కేరళ కోచ్‌ సుమన్‌ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. నాగాలాండ్‌ 40 పరుగుల వరకు చేస్తుందని అనుకున్నామని, కానీ ఊహించని విధంగా రెండు పరుగులకే కుప్పకూలిందన్నారు. ఈ ఘనత కెప్టెన్‌ మిన్ను, ఇతర క్రీడాకారిణులకు దక్కుతుందని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు