నైనాకు రజతం, కాంస్యం

1 Jan, 2019 10:18 IST|Sakshi

జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అమ్మాయి నైనా జైస్వాల్‌ జూనియర్, యూత్‌ జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. హరియాణాలోని సోనెపట్‌లో జరిగిన ఈ పోటీల్లో ఆమె రెండు పతకాలు గెలుపొందింది. యూత్‌ బాలికల సింగిల్స్‌ కేటగిరీలో కాంస్యం నెగ్గిన హైదరాబాదీ టీమ్‌ ఈవెంట్‌లో రజతం గెలుపొందింది. యూత్‌ బాలికల సింగిల్స్‌ సెమీఫైనల్లో నైనా జైస్వాల్‌ 1–4 గేముల తేడాతో శ్రుతి అమ్రుతే (మహారాష్ట్ర) చేతిలో ఓడింది.

అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆమె 4–1తో యశస్విని (కర్ణాటక)పై, క్వార్టర్‌ ఫైనల్లో 4–2తో సెలెన దీప్తి (ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)పై విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) కార్యదర్శి ఎంపీ సింగ్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి పతకాలు, మెరిట్‌ సర్టిఫికేట్లను అందజేశారు. ఇందులో టీటీఎఫ్‌ఐ అడ్వైజర్‌ డి.ఆర్‌. చౌదరి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు