ఒసాకా శ్రమించి...

31 May, 2019 04:57 IST|Sakshi

మూడు సెట్‌ల పోరులో అజరెంకాపై విజయం

పారిస్‌: వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురి పెట్టిన జపాన్‌ స్టార్, ప్రపంచ నంబర్‌వన్‌ నయోమి ఒసాకా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. గతేడాది యూఎస్‌ ఓపెన్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గిన ఒసాకా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ఒసాకా 4–6, 7–5, 6–3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ విక్టోరియా అజరెంకా (బెలారస్‌)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాకా ఆరు ఏస్‌లు సంధించింది.

ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసిన ఆమె తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. తొలి సెట్‌ చేజార్చుకున్న ఒసాకా రెండో సెట్‌లో కోలుకుంది. కీలకదశలో తప్పిదాలు చేయకుండా సంయమనంతో ఆడి అనుకున్న ఫలితాన్ని సాధించింది. 2005లో లిండ్సే డావెన్‌పోర్ట్‌ (అమెరికా) తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో తొలి సెట్‌ను కోల్పోయాక విజయం సాధించిన రెండో టాప్‌ సీడ్‌ ప్లేయర్‌గా ఒసాకా గుర్తింపు పొందింది.
మూడో రౌండ్‌లో కాటరీనా సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో ఒసాకా ఆడుతుంది. రెండో రౌండ్‌లో సినియకోవా 3 గంటల 10 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 7–6 (7/5), 6–7 (8/10), 6–4తో మరియా సకారి (గ్రీస్‌)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో 17 ఏళ్ల అమెరికా అమ్మాయి అమండా అనిసిమోవా 6–4, 6–2తో 11వ సీడ్‌ ఆర్యాన సబలెంక (బెలారస్‌)పై సంచలన విజయం సాధించింది. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, పదో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా) 6–3, 6–2తో కురుమి నారా (జపాన్‌)పై, 15వ సీడ్‌ బెలిండా బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌) 4–6, 6–4, 6–4తో సీగ్మండ్‌ (జర్మనీ)పై గెలిచారు.  

జొకోవిచ్‌ ముందంజ...
పురుషుల సింగిల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా), నాలుగో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా), ఐదో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో థీమ్‌ 6–3, 6–7 (6/8), 6–3, 7–5తో అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ (కజకిస్తాన్‌)పై, జొకోవిచ్‌ 6–1, 6–4, 6–3తో లాక్సోనెన్‌ (స్విట్జర్లాండ్‌)పై, జ్వెరెవ్‌ 6–1, 6–3, 7–6 (7/3)తో వైమెర్‌ (స్వీడన్‌)పై నెగ్గారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–అయోయామ (జపాన్‌) ద్వయం 3–6, 6–2, 7–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)–సాంటియాగో గొంజాలెజ్‌ (మెక్సికో) జంట చేతిలో ఓడిపోయింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు