నయోమి... నవ చరిత్ర

10 Sep, 2018 03:42 IST|Sakshi

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత నయోమి ఒసాకా

ఫైనల్లో సెరెనాపై అలవోక విజయం

గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన  తొలి జపాన్‌ ప్లేయర్‌గా ఘనత

రూ. 27 కోట్ల 40 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

చైర్‌ అంపైర్‌తో సెరెనా అనుచిత ప్రవర్తన

‘దొంగ’... ‘అబద్ధాలకోరు’ అంటూ దూషణ

మహిళల టెన్నిస్‌లో మరో యువ తార అవతరించింది. తన ఆరాధ్య క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌తో జరిగిన ఫైనల్లో ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన జపాన్‌ అమ్మాయి నయోమి ఒసాకా విజేతగా నిలిచింది. యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా ఆవిర్భవించింది. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన తొలి జపాన్‌ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. అయితే సెరెనా అనుచిత ప్రవర్తన ఒసాకా విజయానందాన్ని ఆవిరి చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా కోచ్‌ నుంచి సంకేతాల రూపంలో సలహాలు అందుకుంటోందని చైర్‌ అంపైర్‌ సెరెనాకు తొలి హెచ్చరిక జారీ చేయడం... సెరెనా అసహనంతో రాకెట్‌ విరగ్గొట్టినందుకు రెండో హెచ్చరిక రూపంలో ప్రత్యర్థికి పాయింట్‌ ఇచ్చేయడం... ఆ తర్వాత తీవ్ర పదజాలంతో చైర్‌ అంపైర్‌ను దూషించినందుకు.. మూడో హెచ్చరిక రూపంలో సెరెనా గేమ్‌నే కోల్పోవడం... వెరసి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఒసాకా అద్భుత ఆటతీరు కాకుండా చివరకు సెరెనా అనుచిత ప్రవర్తనే హైలైట్‌ అయ్యింది.   

న్యూయార్క్‌: అద్భుతం జరిగింది. అంచనాలు తలకిందులయ్యాయి. కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించి రికార్డు సృష్టిస్తుందని భావించిన సెరెనా విలియమ్స్‌ భవిష్యత్‌ టెన్నిస్‌ తార చేతిలో బోల్తా పడింది. జపాన్‌ అమ్మాయి నయోమి ఒసాకా ధాటికి ఈ అమెరికా టెన్నిస్‌ దిగ్గజం చేతులెత్తేసింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో 20వ సీడ్‌ నయోమి ఒసాకా 6–2, 6–4తో 17వ సీడ్, ఆరుసార్లు చాంపియన్‌ సెరెనా విలియమ్స్‌ను ఓడించింది.

ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన తొలి జపాన్‌ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. నా లీ (చైనా; 2011లో ఫ్రెంచ్‌ ఓపెన్, 2014లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) తర్వాత ఆసియా నుంచి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన రెండో ప్లేయర్‌గా 20 ఏళ్ల ఒసాకా గుర్తింపు పొందింది. విజేత ఒసాకాకు 38 లక్షల డాలర్లు (రూ. 27 కోట్ల 40 లక్షలు); రన్నరప్‌ సెరెనాకు 18 లక్షల 50 వేల డాలర్లు (రూ. 13 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.   

ఫైనల్‌ చేరే క్రమంలో కేవలం ఒక సెట్‌ కోల్పోయిన ఒసాకా తుది పోరులోనూ పట్టుదలతో ఆడింది. 36 ఏళ్ల సెరెనాకు ప్రతి విభాగంలో ఆమె గట్టి జవాబు ఇచ్చింది. తన ప్రత్యర్థి అపార అనుభవజ్ఞురాలు అయినప్పటికీ... స్టేడియంలోని 24 వేల మంది ప్రేక్షకులు సెరెనా విజయమే కోరుకుంటునప్పటికీ... కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడుతోన్న ఈ జపాన్‌ అమ్మాయిపై ఆ అంశాలు ఎలాంటి ప్రభావం చూపలేదు. పక్కా వ్యూహంతో బరిలోకి దిగిన ఒసాకా కచ్చితమైన సర్వీస్‌లు... కళ్లు చెదిరేరీతిలో రిటర్న్‌ షాట్‌లు... శక్తివంతమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌లతో సెరెనాకు ఊపిరి ఆడకుండా చేసింది. ఒకదశలో ఒసాకా కొట్టిన కొన్ని షాట్‌లను సెరెనా కూడా ప్రశంసించింది.  

మరోవైపు సెరెనాకు ఏదీ కలసి రాలేదు. గతి తప్పిన సర్వీస్‌లు.. డబుల్‌ ఫాల్ట్‌లు... అనవసర తప్పిదాలు... బ్రేక్‌ పాయింట్‌ అవకాశాలను వదులుకోవడం... ఇలా ఆమె ఏదశలోనూ ఒసాకాకు పోటీ ఇచ్చినట్టు అనిపించలేదు. తొలి సెట్‌లోని మూడో గేమ్‌లో, ఐదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఒసాకా తన సర్వీస్‌లను కాపాడుకొని 34 నిమిషాల్లో 6–2తో సెట్‌ను దక్కించుకుంది.  

వివాదం మొదలైందిలా...
రెండో సెట్‌లో తన సర్వీస్‌లో తొలి గేమ్‌ను నెగ్గిన సెరెనా 1–0తో ముందంజ వేసింది. ఈ దశలో గ్యాలరీలో ఉన్న సెరెనా కోచ్‌ ప్యాట్రిక్‌ మురాతొగ్లు నిబంధనలకు విరుద్ధంగా సంకేతాల రూపంలో సలహాలు ఇస్తున్నారని గమనించిన చైర్‌ అంపైర్‌ కార్లోస్‌ రామోస్‌ (పోర్చుగల్‌) సెరెనాను హెచ్చరించారు. ఈ పరిణామానికి ఆశ్చర్యపోయిన సెరెనా చైర్‌ అంపైర్‌ రామోస్‌తో వాగ్వాదానికి దిగింది.

‘కోచ్‌ తనకు ఎలాంటి సంకేతాలు ఇవ్వడంలేదు. మోసపూరిత పద్ధతులతో గెలిచే బదులు నేను ఓడిపోవడానికి సిద్ధపడతాను’ అని రామోస్‌కు సెరెనా సమాధానం ఇచ్చింది. అనంతరం ఒసాకా తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో స్కోరు 1–1తో సమమైంది. ఆ తర్వాత సెరెనా కూడా గేమ్‌ నెగ్గి 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. గేమ్‌ పూర్తయ్యాక తన కుర్చీ వద్దకు వెళ్తూ ‘నేను మోసం చేయడంలేదు’ అని చైర్‌ అంపైర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది.

కంట కన్నీరు....
జరిమానా రూపంలో గేమ్‌ ఒసాకాకు ఇవ్వడంతో సెరెనా మరింత రెచ్చిపోయింది. టోర్నీ రిఫరీ కోర్టులోకి రావాలని కోరింది. ‘ఇది అన్యాయం. పురుష ప్లేయర్లు నాకంటే దారుణంగా ఎన్నోసార్లు దూషించారు. కానీ వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. నేను మహిళను కాబట్టే నన్ను శిక్షించారు. ఇది సరైన పద్ధతి కాదు’ అని టోర్నీ రిఫరీతో కన్నీరు కారుస్తూ వాపోయింది. టోర్నీ రిఫరీ చైర్‌ అంపైర్‌తో మాట్లాడి సెరెనాకు సర్దిచెప్పడంతో మళ్లీ ఆట కొనసాగింది. తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ నిలబెట్టుకుంది.

స్కోరు 5–4 ఉండగా పదో గేమ్‌లో ఒసాకా తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అయితే కోర్టులో జరిగిన పరిణామాలతో కలత చెందినట్లు కనిపించిన ఒసాకా విజయం అనంతరం సంబరాలను కూడా చేసుకోలేదు. ఒసాకాను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని అభినందించిన సెరెనా మళ్లీ చైర్‌ అంపైర్‌ వద్దకు వెళ్లి తనకు క్షమాపణలు చెప్పాలని కోరింది. ఆయన స్పందించలేదు. దాంతో సెరెనా చైర్‌ అంపైర్‌తో కరచాలనం చేయకుండానే వెనుదిరిగింది.

నువ్వో దొంగవి...
రెండో సెట్‌లో ఆరో గేమ్‌ ముగిశాక సెరెనా చైర్‌ అంపైర్‌తో మరోసారి వాగ్వాదానికి దిగింది. ‘నేను గ్యాలరీలో నుంచి ఎలాంటి కోచింగ్‌ తీసుకోవడంలేదు. నేను మోసానికి పాల్పడటం లేదని మీరు మైక్‌ ద్వారా ప్రకటించాలి. నాకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాలి. నా జీవితంలో నేను ఏనాడూ మోసం చేయలేదు’ అని ఆవేశంతో ఊగిపోయింది. ఆ తర్వాత ఏడో గేమ్‌లో సెరెనా మళ్లీ తన సర్వీస్‌ చేజార్చుకుంది. ఒసాకా 4–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో మళ్లీ చైర్‌ అంపైర్‌ను సెరెనా దూషించడం మొదలుపెట్టింది. ‘నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు. నువ్వో అబద్ధాలకోరువి. నువ్వు బతికినంతకాలం నేను ఆడుతున్న మ్యాచ్‌కు అంపైరింగ్‌ చేయొద్దు. నన్నెప్పుడు క్షమాపణలు కోరుతావ్‌? ఇప్పుడే క్షమాపణ చెప్పు. నా నుంచి పాయింట్‌ లాక్కున్నావు. నువ్వు ఓ దొంగవి’ అని తీవ్ర పదజాలాన్ని వాడింది. సెరెనా దూషణ పర్వానికి జరిమానాగా చైర్‌ అంపైర్‌ ఈసారి ఏకంగా ఒక గేమ్‌ను ఒసాకాకు ఇచ్చాడు. దాంతో ఒసాకా 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది.

రాకెట్‌ విరగ్గొట్టి....
రెండో సెట్‌ నాలుగో గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సెరెనా 3–1తో ముందంజ వేసింది. అయితే ఐదో గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయాక సెరెనా తన రాకెట్‌ను నేలకేసి బలంగా కొట్టింది. దాంతో క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఆమెపై చైర్‌ అంపైర్‌ పెనాల్టీ విధించారు. ఫలితంగా ఒసాకా ఆరో గేమ్‌ను నేరుగా 15–0తో ప్రారంభించింది. తన సర్వీస్‌ను కాపాడుకుంది. స్కోరు 3–3తో సమమైంది.

నన్ను క్షమించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సెరెనా విజయం సాధించాలని కోరుకున్నారని తెలుసు. అయితే ముగింపు ఇలా ఉన్నందుకు క్షమాపణలు కోరుతున్నా. నేనీ స్థాయికి చేరుకోవడానికి అమ్మానాన్న ఎన్నో త్యాగాలు చేశారు. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో సెరెనాతో ఆడాలని ఎప్పటినుంచో కలలు కన్నాను. నా కల నిజమైనందుకు ఆనందంగా ఉంది. 
–నయోమి ఒసాకా

నయోమి చాలా బాగా ఆడింది. ఆమెకిదే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. మీరందరూ నాకు మద్దతు ఇచ్చేందుకు వచ్చారని తెలుసు. విజయార్హత ఉన్నవారికి గుర్తింపు ఇవ్వాలి. గేలి చేయడం మానేసి మీరందరూ నయోమిని అభినందించాలి. కోచ్‌ ప్యాట్రిక్‌ నాకు సలహాలు ఇచ్చానని అంగీకరించారు. కానీ సంకేతాలు ఇస్తున్నపుడు నేను ఆయనవైపు చూడలేదు. నాకు కోర్టులో కోచింగ్‌ తీసుకోవడం అలవాటు కూడా లేదు. గతంలో పురుష ప్లేయర్లు చైర్‌ అంపైర్లను చాలా పరుష పదజాలంతో దూషించారు. కానీ వారిపై ఎప్పుడూ గేమ్‌ పెనాల్టీ విధించలేదు. నేనిక్కడ మహిళల హక్కుల కోసం, వారి సమానత్వం కోసం పోరాడేందుకు ఉన్నాను. నాకు న్యాయం జరగకున్నా భవిష్యత్‌లో ఇతరులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.
– సెరెనా

మరిన్ని వార్తలు