ఆత్మీయ స్వాగతాలు... అభినందనలు..! 

28 Aug, 2019 05:08 IST|Sakshi

స్వదేశంలో పీవీ సింధు బిజీ బిజీ

ప్రధానిని కలిసిన ప్రపంచ చాంపియన్‌  

హైదరాబాద్‌లో మీడియా సమావేశం   

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వరకు... మంత్రి నుంచి ప్రధాన మంత్రి వరకు అందరి అభినందనల వర్షంలో పూసర్ల వెంకట సింధు తడిసి ముద్దయింది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత స్వదేశం తిరిగొచ్చిన ఆమెకు ముందుగా దేశ రాజధానిలో, ఆ తర్వాత హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. కోచ్‌ పుల్లెల గోపీచంద్‌తో కలిసి ముందుగా కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజుతో భేటీ జరగ్గా... దేశ ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో ఆమెను ఆశీర్వదించారు. అనంతరం స్వస్థలంలో సహచర పతక విజేత సాయిప్రణీత్‌తో కలిసి సింధు మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సింధు, సాయి, కోచ్‌ గోపీచంద్‌ స్పందనలు వారి మాటల్లోనే...  

దేశం గర్వపడే చాంపియన్‌ పీవీ సింధు: ప్రధాని మోదీ 
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన తెలుగుతేజం పీవీ సింధుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన చాంపియన్‌ సింధు అంటూ పొగడ్తలు కురిపించారు. సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న పీవీ సింధుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం ఆమె కోచ్‌ పుల్లెల గోపీచంద్, తండ్రి పీవీ రమణ, కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజుతో కలసి  ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా సింధు సాధించిన స్వర్ణ పతకాన్ని ఆమె మెడలో వేసి మోదీ అభినందించారు. ‘బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన చాంపియన్‌ సింధు. ఆమెను కలవడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ మోదీ ట్వీట్‌ చేసి ఫోటోను పంచుకున్నారు. అంతకుముందు సింధుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు రూ. 10 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు.    

ఎన్నాళ్లో వేచిన విజయం... 
వరల్డ్‌ చాంపియన్‌గా నిలవడం చాలా గర్వంగా అనిపిస్తోంది. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావట్లేదు. ఎంతో కాలంగా ఆశించిన ఈ విజయాన్ని ఎట్టకేలకు సాధించాను. దీని కోసం చాలా కష్టపడ్డాను. అందుకు సహకరించిన నా కోచింగ్‌ బృందానికి కృతజ్ఞతలు. కాంస్య, రజతాలు సాధించినప్పుడు కూడా సంతోషం కలిగింది కానీ ఇంకా సాధించాల్సి ఉందని అనిపించింది. గత రెండు ఫైనల్స్‌లో ఓడినప్పుడు కొంత నిరాశ చెందినా నా ఆటను నేను నమ్మాను. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని మళ్లీ దూసుకొచ్చాను. అంతిమ లక్ష్యం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే అయినా అంతకుముందు నేను ఇంకా చాలా గెలవాల్సి ఉంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నేను ప్రతీ మ్యాచ్‌కు ప్రత్యేకంగా సిద్ధమయ్యాను. ప్రత్యర్థులకు నా ఆట గురించి బాగా తెలుసు కాబట్టి ఒకే తరహా ఆటతో విజయాలు సాధించలేం. ఇకపై కూడా కొత్త అంశాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. ఓడిపోతాననే భయం లేకుండా ఆడాను కాబట్టే ఫైనల్‌ ఏకపక్షంగా గెలవగలిగాను. 
–పీవీ సింధు, ప్రపంచ బ్యాడ్మింటన్‌ స్వర్ణ పతక విజేత  

ఒలింపిక్స్‌ క్వాలిఫయింగే లక్ష్యం... 
వారం రోజుల వ్యవధిలో అర్జున పురస్కారానికి ఎంపిక కావడం, ఇటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గెలవడం నా ఆనందాన్ని రెట్టింపు చేశాయి. క్వార్టర్స్‌లో క్రిస్టీపై గెలవగానే కాంస్యం ఖాయమైందని తెలుసు కాబట్టి గొప్పగా అనిపించింది. ఆ సమయంలో ప్రకాశ్‌ సర్‌ 36 ఏళ్ల రికార్డులాంటి విషయాలు ఏవీ నా మనసులోకి రాలేదు. ఈ మ్యాచ్‌ తొలి గేమ్‌లో కీలక సమయంలో గోపీ సర్‌ చేసిన సూచనల వల్లే గెలవగలిగాను. మొమోటాతో గతంలోనూ ఆడిన అనుభవం ఉంది కాబట్టి సెమీస్‌లో ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగాను. అయితే అతను నాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లాంటి ఈవెంట్‌లో మనం 100 శాతం శ్రమించినా కొంతయినా అదృష్టం కూడా కలిసి రావాలి. గతంలో అనేక మందికి సాధ్యం కానిది నేను సాధించాను కాబట్టి వారికంటే గొప్పగా భావించడం లేదు. ఇప్పుడు నా తదుపరి లక్ష్యం వచ్చే టోర్నీలలో బాగా ఆడి ప్రస్తుత ర్యాంక్‌ (15)ను నిలబెట్టుకోవడం, టోక్యోకు అర్హత సాధించడం. 
–సాయిప్రణీత్, ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత  

ప్లాన్‌ ‘బి’ అవసరం రాలేదు... 
నాకు వ్యక్తిగతంగా ఇది ఎంతో ఆనందకరమైన క్షణం. మన ప్లేయర్‌ స్వర్ణం సాధించాలనేది చాలా కాలంగా నా కల. అది ఇప్పుడు నెరవేరింది. నా దృష్టిలో రెండు పతకాలు అమూల్యమైనవే. సింధు అంచనాలను నిజం చేస్తే, సాయిప్రణీత్‌ అద్భుతం చేసి చూపించాడు. 2013లో సింధు తొలిసారి కాంస్యం గెలిచినప్పుడు ఎంతో సంతోషించాం. ఆ తర్వాత మరో కాంస్యం, రెండు రజతాలు వచ్చినప్పుడు కూడా ఎంతో సాధించిన సంతృప్తి కలిగింది. అయితే అదే సమయంలో స్వర్ణం సాధించగలమనే విశ్వాసం కూడా ఏర్పడింది. సింధు సూపర్‌ ఫిట్‌నెస్‌ కూడా ఆమె గెలుపునకు ఒక కారణం. ఆమె అన్ని మ్యాచ్‌లు చాలా తెలివిగా ఆడింది. యమగూచి ఆరంభంలోనే వెనుదిరగ్గా... తైజుపై క్వార్టర్స్‌లో గెలవడంతోనే స్వర్ణంపై నమ్మకం ఏర్పడింది. మొదటి నుంచి అటాక్‌ మాత్రమే చేయాలనేది కొత్త వ్యూహం. ఇది విఫలమైతే ఏం చేయాలో ఆలోచించేవాళ్లం. కానీ సింధు దీనిని సమర్థంగా అమలు చేయడంతో ప్లాన్‌ ‘బి’ అవసరమే లేకపోయింది. 
–పుల్లెల గోపీచంద్, భారత చీఫ్‌ కోచ్‌  

మరిన్ని వార్తలు