మీ మద్దతు కావాలి

4 Apr, 2020 03:26 IST|Sakshi

క్రీడాకారులతో ప్రధాని మోద

‘సై’ అన్న క్రీడాలోకం  

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కరోనా మహమ్మారిపై మోగిస్తున్న యుద్ధభేరిలో భారత క్రీడాకారుల మద్దతు కోరారు. శుక్రవారం ఆయన క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో క్రీడాకారులతో మాట్లాడారు. కోవిడ్‌–19పై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్, సౌరవ్‌ గంగూలీ, ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పీవీ సింధు, సాయిప్రణీత్, అథ్లెటిక్స్‌ దిగ్గజం పీటీ ఉష, భారత మహిళల హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌ , టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడా ప్రముఖుల్లో కొందరు. కరోనా వైరస్‌పై విజయం సాధించాలంటే లాక్‌డౌన్‌లో అందరూ కచ్చితంగా వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించేలా విస్తృత అవగాహన కల్పించాలని మోదీ సూచించారు.

తమ అభిమాన ఆట గాళ్ల సంకేతాలు భారతీయులు చెవికెక్కించుకుంటే అనుకున్న ఫలితాలు సాధించవచ్చని ప్రధాని భావిస్తున్నారు. ‘ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మీ మీ సూచనలు, సలహాలు అవశ్యం. మైదానాల్లో మీలాగే ఇప్పుడు ఇండియా మొత్తం మహమ్మారిపై పోరాడుతోంది. దేశ ప్రతిష్టను పెంచే మీలాంటివారు ముందుకొచ్చి జనాన్ని జాగృతం చేస్తే ఆ స్ఫూర్తితో దేశం వైరస్‌పై పైచేయి సాధిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం’ అని వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ ఆటగాళ్లతో అన్నారు. వీడియో కాల్‌పై సచిన్‌ మాట్లాడుతూ... కరోనాపై పోరు ముగిశాక కూడా ఇకపై మనమంతా కరచాలనానికి బదులు మన సంప్రదాయం ప్రకారం నమస్కారంతోనే పలుకరించుకోవాలని సూచించినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు