మూడు నో బాల్స్‌ వేస్తే ఒకటే చెక్‌ చేశారు..

22 Nov, 2019 17:46 IST|Sakshi

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత పిన్నవయసులో టెస్టులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా ఘనత సాధించిన పాకిస్తాన్‌ యువ పేసర్‌ నసీమ్‌ షా తీవ్రంగా నిరాశపరిచాడు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా శుక్రవారం రెండో రోజు ఆటలో 16 ఓవర్లు వేసిన నసీమ్‌ 65 పరుగులిచ్చి వికెట్‌ సాధించలేకపోయాడు. కాకపోతే భారీ సెంచరీ సాధించిన ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(151 బ్యాటింగ్‌) వికెట్‌ను తీసే అవకాశాన్ని నసీమ్‌ తృటిలో చేజార్చుకున్నాడు. 27వ ఓవర్‌ చివరి బంతిని వార్నర్‌కు వేయగా అది క్యాచ్‌ అయ్యింది.  దాంతో వార్నర్‌ పెవిలియన్‌కు చేరేందుకు సిద్ధమయ్యాడు. దానిపై అనుమానం వచ్చిన ఫీల్డ్‌ అంపైర్‌ వార్నర్‌ను అక్కడే ఆగమని ఆ బంతిని చెక్‌ చేశాడు. అది నో బాల్‌ కావడంతో వార్నర్‌కు లైఫ్‌ లభించింది. దాంతో నసీమ్‌ తొలి టెస్టు వికెట్‌ను తీసే అవకాశాన్ని కోల్పోయాడు. అప్పటికి వార్నర్‌ హాఫ్‌ సెంచరీ మాత్రమే దాటాడు. ఆ తర్వాత వార్నర్‌ మరొక లైఫ్‌ ఇవ్వకుండా భారీ శతకంతో మెరిశాడు.

కాగా, నసీమ్‌ వేసిన ఆ ఓవర్‌లో మూడు నోబాల్స్‌ను వేయడం గమనార్హం. కాకపోతే వాటిలో ఒక్కటి మాత్రమే ఫీల్డ్‌ అంపైర్లు చెక్‌ చేశారు. అది కూడా వార్నర్‌ ఔట్‌ కావడంతో ఆ బంతిని రిప్లే ద్వారా పునః సమీక్షించారు. అంతకుముందు రెండు బంతులు కూడా నో బాల్స్‌గా నసీమ్‌ వేసినా వాటిని పట్టించుకోలేదు. ఇటీవల నోబాల్స్‌ కోసం ఒక అంపైర్‌ను పెడతామని ఐసీసీ ప్రకటించిన క్రమంలో ఫీల్డ్‌ అంపైర్లు అలసత్వం ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది.  నాన్‌ స్టైకర్‌ ఎండ్‌లో ఉన్న స్టాండింగ్‌ అంపైర్‌ ఓవర్‌స్టెప్పింగ్‌ నో బాల్స్‌ను పసిగట్టడంలో విఫలమైతే ఫలితాలే తారుమారు అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..

ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 312 పరుగులు చేసింది. జో బర్న్ష్‌(97) వికెట్‌ను మాత్రమే ఆసీస్‌ కోల్పోయింది. వార్నర్‌- లబూషేన్‌(55 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు.  కేవలం ఆసీస్‌ ఒక్క వికెట్‌ను మాత్రమే చేజార్చుకోవడంతో మూడో రోజు ఆటలో మరింత ఆధిక్యాన్ని సాధించి పాక్‌ సవాల్‌ విసరడం ఖాయంగా కనబడుతోంది. పాకిస్తాన్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు