ఇంగ్లండ్‌Vs భారత్‌ కాదు.. మెన్‌ Vs బాయ్స్‌

14 Aug, 2018 08:44 IST|Sakshi

కోహ్లిసేనపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ సెటైర్‌

లండన్‌ : లార్డ్స్‌ టెస్టులో టీమిండియా ఆటగాళ్ల ఆట చిన్నపిల్లలను తలిపించిందని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసీర్ హుస్సేన్ ఎగతాళి చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కనీస పోరాట పటిమ చూపించలేకపోయారని, మెన్‌‌Vs బాయ్స్‌ అన్నట్లు సాగిందని విమర్శించాడు. ఈ దిగ్గజ క్రికెటర్‌ ఓ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘ఇక్కడి పిచ్‌ పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ అద్భుతమని తెలిసిందే. కానీ ప్రపంచ నెం1 అయినా భారత్‌ ఎలా ఆడుతుందోనని అందరూ దృష్టిసారించారు. కానీ ఆజట్టు ఘోరంగా విఫలమైంది. ప్రపంచనెం1 అంటే ఓ తుపాకీలాంటి జట్టు. సిరీస్‌ హోరాహోరిగా సాగుతుందనుకుంటే మెన్‌Vs బాయ్స్‌  అన్నట్లు సాగింది. వారు అపసవ్య దిశలో పయనిస్తున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో రాణించిన కోహ్లి లార్డ్స్‌లో విఫలమయ్యాడు.

వెన్నునొప్పితో అతను బాధపడినట్లు కనిపించింది. ఇక అశ్విన్‌ పోరాటం ఆకట్టుకుంది. కానీ మిగతా బ్యాట్స్‌మన్‌ వారి వైఫల్యాన్ని కొనసాగించారు. మూడో టెస్ట్‌ జరిగే ట్రెంట్‌ బ్రిడ్జ్‌ కూడా భారత్‌కు ప్రతికూలమే. వారు కష్టపడితే డ్రా మాత్రమే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లండ్‌ పేసర్స్‌ జేమ్స్‌ అండర్సన్‌, బ్రాడ్‌లకు మంచి రికార్డు ఉంది. కనుక ఈ మ్యాచ్‌ భారత్‌కు అంత సులువు కాదు. 2016 భారత్‌లో జరిగిన సిరీస్‌ 4-0  వైట్‌వాష్‌ను ఇంగ్లండ్‌ 5-0తో తిరిగివ్వనుంది. ఇంగ్లండ్‌ జట్టు ప్రస్తుతం ఆకలితో ఉంది. వారు విశ్రాంతి తీసుకోరు. ఇంకా ఇంకా బాగా ఆడాలని ప్రయత్నిస్తారు’ అని నాసీర్‌ హుస్సేన్‌ అభిప్రాయపడ్డాడు. (చదవండి: కోహ్లి ‘టాప్‌’ చేజారె... )

ఇక ఇంగ్లండ్‌తో లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌, 159 పరుగుల తేడాతో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో చివర వరకు పోరాడి 31 పరుగులతో ఓటమి చెందింది. దీంతో ఇంగ్లండ్‌ 5 టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది.

చదవండి: గెలిపించేదెవరు..?

మరిన్ని వార్తలు