ఆధిక్యం అటా ఇటా?

27 Mar, 2017 07:29 IST|Sakshi
ఆధిక్యం అటా ఇటా?

53 పరుగుల దూరంలో భారత్‌
తొలి ఇన్నింగ్స్‌లో 248/6

రాణించిన రాహుల్, పుజారా
లయన్‌కు 4 వికెట్లు  


భారత్‌ మెరుగ్గానే ఆడింది, కానీ ఆడాల్సినంత బాగా ఆడలేదు... ఇద్దరు అర్ధ సెంచరీలు చేస్తే మరొకరు చేరువగా వచ్చారు, కానీ ఒక్కరూ దానిని భారీ స్కోరుగా మలచలేకపోయారు. పిచ్‌ ప్రమాదకరంగా లేదు, బౌలింగ్‌ భీకరంగానూ లేదు... కానీ ఆధిపత్యం ప్రదర్శించడంలో విఫలమయ్యారు... గత టెస్టులాగే క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తూ ఒత్తిడి పెంచడంలో సఫలమైంది.

ఒక దశలో 108/1తో భారత్‌ మెరుగైన స్థితిలో నిలిచినా... అనవసర ఆవేశం ప్రదర్శించి రాహుల్‌ చేజేతులా వికెట్‌ ఇచ్చుకోవడంతో జట్టు తడబడింది. వికెట్‌పై బౌన్స్‌ను సమర్థంగా ఉపయోగించుకున్న లయన్‌ చివరి సెషన్‌లోనే నాలుగు కీలక వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. పిచ్‌ మారిపోతున్న నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో చేసే పరుగులే కీలకం కానున్నాయి. చేతిలో నాలుగు వికెట్లతో భారత్‌ ఎంత ఆధిక్యం సాధించగలదన్నదే మూడో రోజు కీలకం.  

ధర్మశాల: బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ ఫలితాన్ని తేల్చే నాలుగో టెస్టులో రెండో రోజు ఆట కూడా ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్లు పైచేయి సాధించేందుకు తీవ్రంగా శ్రమించాయి. చివరకు ఈ పోరులో టీమిండియా కాస్త వెనుకంజలో నిలిచింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (124 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్‌), చతేశ్వర్‌ పుజారా (151 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా... కెప్టెన్‌ రహానే (104 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్‌), అశ్విన్‌ (49 బంతుల్లో 30; 4 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. రాహుల్, పుజారా రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. ప్రస్తుతం జడేజా (16 బ్యాటింగ్‌), సాహా (10 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ బౌలర్లలో లయన్‌కు 4 వికెట్లు దక్కాయి.  

సెషన్‌ 1: రాహుల్‌కు లైఫ్‌
రెండో రోజు ఆటను రాహుల్, విజయ్‌ నెమ్మదిగా ఆరంభించారు. మొదట్లో ఆసీస్‌ పేసర్లు హాజల్‌వుడ్, కమిన్స్‌ చక్కటి బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగా... పిచ్‌పై ఉన్న బౌన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఆసీస్‌ ఎనిమిదో ఓవర్లోనే స్పిన్నర్‌ లయన్‌ను బౌలింగ్‌కు దించింది. హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లో అప్పటి వరకు ఓపిగ్గా ఆడిన విజయ్‌ (36 బంతుల్లో 11; 2 ఫోర్లు) చివరకు అతని బౌలింగ్‌లోనే వెనుదిరగడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాతి ఓవర్లోనే స్లిప్‌లో రెన్‌షా క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన రాహుల్‌ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు పుజారా జాగ్రత్తగా ఆడుతూ  క్రీజ్‌లో పాతుకుపోయాడు.
ఓవర్లు: 27, పరుగులు: 64, వికెట్లు: 1

సెషన్‌ 2: కీలక భాగస్వామ్యం
లంచ్‌ తర్వాత ఒకీఫ్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదిన రాహుల్, ఆ వెంటనే 98 బంతుల్లో ఈ సిరీస్‌లో ఐదో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కమిన్స్‌తో కొంత వాదన చోటు చేసుకున్న తర్వాత రాహుల్‌ ఏకాగ్రత కోల్పోయాడు. కమిన్స్‌ వేసిన బౌన్సర్‌ను అంచనా వేయకుండా హుక్‌ షాట్‌ ఆడబోయి రాహుల్‌ వెనుదిరిగాడు. మరోవైపు 132 బంతుల్లో పుజారా హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే ఆరంభంలో కొన్ని ఉత్కంఠభరిత క్షణాలు ఎదుర్కొన్నా...మెల్లగా  నిలదొక్కుకున్నాడు.
ఓవర్లు: 32, పరుగులు: 89, వికెట్లు: 1

సెషన్‌ 3: లయన్‌ దెబ్బ
విరామం తర్వాత తొలి ఓవర్లోనే పుజారాను అవుట్‌ చేసి లయన్‌ భారత్‌ను దెబ్బ తీశాడు. అనూహ్యంగా ఎగసిన బంతిని ఆడలేక పుజారా షార్ట్‌లెగ్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. కొద్దిసేపటికే కరుణ్‌ నాయర్‌ (5) కూడా సరిగ్గా ఇదే తరహాలో వెనుదిరిగాడు. ఇంగ్లండ్‌పై ట్రిపుల్‌ సెంచరీ సాధించిన తర్వాత నాయర్‌ వరుసగా నాలుగో ఇన్నింగ్స్‌లో కూడా విఫలమయ్యాడు. ఈ దశలో చక్కగా ఆడుతున్న రహానేకు మరో ఎండ్‌లో అశ్విన్‌ నుంచి సహకారం లభించింది. అయితే లయన్‌ బౌలింగ్‌లోనే స్లిప్‌లో స్మిత్‌ అద్భుత క్యాచ్‌ అందుకోవడంతో రహానే ఇన్నింగ్స్‌కు తెరపడింది. దూకుడుగా ఆడుతున్న అశ్విన్‌ను కూడా పెవిలియన్‌ పంపించి లయన్‌ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. అంపైర్‌ ఎల్బీగా ప్రకటించడంతో అశ్విన్‌ రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. వచ్చీ రాగానే రెండు సిక్సర్లు బాది జడేజా దూకుడుగా ఆడే ప్రయత్నం చేయగా...రెన్‌షా మరో క్యాచ్‌ వదిలేయడంతో సాహాకు లైఫ్‌ లభించింది.
ఓవర్లు: 31, పరుగులు: 95, వికెట్లు: 4

(డ్రాప్‌) రెన్‌షా (బి) కమిన్స్‌
రెండో రోజు భారత్‌కు రెండు సార్లు అదృష్టం రెన్‌షా రూపంలో కలిసొచ్చింది. స్లిప్‌లో అతను రెండు సార్లు క్యాచ్‌ వదిలేసి భారత్‌కు మేలు చేశాడు. ప్యాట్‌ కమిన్స్‌ వేసిన 12వ ఓవర్లో రాహుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను మొదటి స్లిప్‌లో రెన్‌షా వదిలేశాడు. అతని చేతి వేళ్లకు తగిలి బంతి వెళ్లిపోయింది. ఆ సమయంలో రాహుల్‌ స్కోరు 10 మాత్రమే. ఆ తర్వాత రాహుల్‌ మరో 50 పరుగులు జోడించాడు. ఆట ముగియడానికి కొద్ది సేపు ముందే కమిన్స్‌ బౌలింగ్‌లోనే అదే మొదటి స్లిప్‌లో సాహా ఇచ్చిన అంతకంటే సులువైన మరో క్యాచ్‌ను రెన్‌షా వదిలేశాడు. ఈ సమయంలో సాహా స్కోరు 9 మాత్రమే.

మూడో రోజు సాహా గనక మ్యాచ్‌ దిశను మార్చే కీలక ఇన్నింగ్స్‌ ఆడితే మాత్రం రెన్‌షా చేసిన తప్పుకు ఆసీస్‌ భారీ మూల్యం చెల్లించినట్లు అవుతుంది. మరోసారి కమిన్స్‌ బౌలింగ్‌లోనే పుజారా (స్కోరు 28) బ్యాట్‌కు తగిలిన బంతి రెన్‌షాకు కాస్త ముందు పడింది. గంటకు 146 కిలోమీటర్లకు తగ్గని వేగంతో నిలకడగా, అద్భుతంగా బౌలింగ్‌ చేస్తూ వచ్చిన ఆసీస్‌ బౌలర్‌ కమిన్స్‌ను సహచరుడు రెన్‌షా మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాడు.

3 ఒక సిరీస్‌లో సెంచరీ లేకుండా 5 అర్ధ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడు రాహుల్‌.

2 ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పుజారా (1,316) రెండో స్థానంలో నిలిచాడు. 2005–06 సీజన్‌లో పాంటింగ్‌ 1,483 పరుగులు చేశాడు.

10  టెస్టుల్లో కనీసం 1000 పరుగులు చేసి 100 వికెట్లు తీసిన పదో భారత ఆటగాడిగా జడేజా నిలిచాడు. జడేజా ఈ సీజన్‌లోనే 500కు పైగా పరుగులు చేసి 50కి పైగా వికెట్లు తీయడం విశేషం.

>
మరిన్ని వార్తలు