లయన్.. అరుదైన మైలురాయి

8 Sep, 2017 13:52 IST|Sakshi
లయన్.. అరుదైన మైలురాయి

చిట్టగాంగ్: బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో విజృంభించి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు స్పిన్నర్ నాధన్ లయన్ అరుదైన మైలురాయిని సాధించారు. బంగ్లాతో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసిన లయన్.. రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో మెరిశారు. దాంతో ఒక టెస్టు మ్యాచ్ లో 13 వికెట్లను లయన్ తన ఖాతాలో వేసుకున్నారు. తద్వారా ఆసియాలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్ని నమోదు చేసిన ఆస్ట్రేలియా బౌలర్ రికార్డును లయన్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓకెఫీ రికార్డును లయన్ అధిగమించారు. గతేడాది భారత్ తో జరిగిన పుణె టెస్టులో ఓకెఫీ 12 వికెట్లతో ఉన్న రికార్డును లయన్ బద్ధలు కొట్టాడు.


మరొకవైపు కనీసం ఐదు వికెట్లను వరుసగా మూడుసార్లు సాధించిన ఘనతను లయన్ తన కెరీర్ లో తొలిసారి సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంచితే, ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత స్పిన్ ద్వయం అశ్విన్, రవీంద్ర జడేజాలను లయన్ అధిగమించాడు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ లో అశ్విన్, జడేజాలు 44 వికెట్లతో ఇప్పటివరకూ టాప్ లో ఉండగా, దాన్ని లయన్ 45 వికెట్లతో సవరించాడు.

బంగ్లాతో రెండో టెస్టులో ఆసీస్ విజయం సాధించి సిరీస్ ను 1-1 తో సమం చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్టు మ్యాచ్ లో ఓడిపోయిన ఆసీస్.. రెండో టెస్టులో చెలరేగి ఆడి సిరీస్ ను సమం చేసుకుంది. కాగా, తొలి టెస్టులో ఓటమి ఎదుర్కోవడంతో ఆసీస్ తన టెస్టు ర్యాంకింగ్స్ లో నాల్గో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ర్యాంకింగ్స్ లో భారత్ తన టాప్ ప్లేస్ ను నిలబెట్టుకుంది.

>
మరిన్ని వార్తలు