జాతీయ చాంపియన్‌ ఆంధ్ర

1 Dec, 2017 01:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీసీసీఐ మహిళల అండర్‌–19 వన్డే టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చి చాంపియన్‌గా నిలిచింది. గుంటూర్‌లో గురువారం జరిగిన ఫైనల్లో ముంబై జట్టుపై 47 పరుగులతో గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది.  టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర జట్టు 49.5 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. ఇ.పద్మజ (93 బంతుల్లో 73; 8 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, వి. పుష్పలత (34; 3 ఫోర్లు) రాణించింది. ముంబై బౌలర్లలో  జెమీమా రోడ్రిగ్స్‌ 3 వికెట్లు పడగొట్టగా... ఫాతిమా జఫర్, జాన్వి, వృషాలి తలా 2 వికెట్లు తీశారు.  అనంతరం 193 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ముంబై 43.4 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది.

దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతోన్న 17 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్‌ (29 బంతుల్లో 26; 4 ఫోర్లు)ను తక్కువ స్కోరుకే అవుట్‌ చేయడంతో ఆంధ్ర పని సులువైంది. భావన బౌలింగ్‌లో పద్మజకు క్యాచ్‌ ఇచ్చి జెమీమా వెనుదిరిగింది. సయాలి సట్ఘరే (57 బంతుల్లో 42 నాటౌట్‌; 5 ఫోర్లు) చివరి వరకు పోరాడినా మరో ఎండ్‌ నుంచి ఆమెకు తగిన సహకారం లభించలేదు. ఆంధ్ర బౌలర్లలో పద్మజ, భావన, శిరీష తలా 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆకట్టుకున్న పద్మజకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం దక్కింది. ‘బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా ముంబైకి చెందిన జెమీమా (1013 పరుగులు) ఎంపికవగా, ఫాతిమా జఫర్‌ (26 వికెట్లు) ‘బెస్ట్‌ బౌలర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డును గెలుచుకుంది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు