ఎలాంటి మార్పూ లేదు

27 Nov, 2014 00:54 IST|Sakshi
ఎలాంటి మార్పూ లేదు

సిడ్నీ: తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఆరోగ్య పరిస్థితిలో బుధవారం ఎలాంటి మెరుగుదల రాలేదు. ఇప్పటికీ అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ‘ఫిల్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. ఇంకా విషమంగానే ఉంది. స్కానింగ్ నివేదికలు వచ్చిన తర్వాత, ఏదైనా మెరుగుదల ఉంటే తెలియజేస్తాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది.

మంగళవారం షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ ఆడుతూ అబాట్ బౌలింగ్‌లో బంతి తలకు తగలడంతో హ్యూస్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలోని ప్రస్తుత రౌండ్ అన్ని మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు సీఏ ప్రకటించింది. ‘హ్యూస్ ఆరోగ్యం గురించి ఆటగాళ్లంతా ఆందోళనగా ఉన్నారు. ఇది క్రికెట్ ఆడేందుకు తగిన సమయం కాదు. ఈ విషయాన్ని ఆటగాళ్లతో చర్చించిన అనంతరం మ్యాచ్‌లు రద్దు చేశాం’ అని సీఏ ఈజీఎం హోవార్డ్ చెప్పారు.

 హ్యూస్ పాత హెల్మెట్ ధరించాడు...
 మ్యాచ్ ఆడుతున్న సమయంలో హ్యూస్ తమ సంస్థ రూపొందించిన కొత్త తరహా మోడల్ కాకుండా పాత హెల్మెట్‌ను ధరించినట్లు తయారీదారు ‘మసూరి’ సంస్థ ప్రకటించింది. దాంతో కాస్త ఎక్కువ రక్షణ లభించేదన్న సదరు సంస్థ... కొత్త మోడల్ హెల్మెట్, హ్యూస్‌ను కాపాడేదా అనే ప్రశ్నకు మాత్రం తగిన సమాధానమివ్వలేదు.

మరోవైపు ఫిల్ త్వరగా కోలుకోవాలంటూ సచిన్ తేందూల్కర్, గిల్‌క్రిస్ట్, లారావంటి ప్రముఖులు ఆకాంక్షించారు. ‘క్రికెట్ ప్రమాదకర క్రీడ. రగ్బీ, రేసింగ్‌లాగే ఇందులోనూ ఎల్లప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి ఘటన మరోసారి జరగదని అనుకోలేము. హ్యూస్ ఘటన దురదృష్టకరం. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని లారా అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు