శభాష్‌ సైనీ..

4 Aug, 2019 11:22 IST|Sakshi

లాడర్‌హిల్‌ (అమెరికా): వెస్టిండీస్‌తో ఫ్లోరిడాలో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించడంలో పేసర్‌ నవదీప్‌ సైనీ కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి మూడు ప్రధాన వికెట్లను సాధించాడు ఆసాంతం 140 కి.మీ. పైగా వేగంతో సాగిన అతడి బౌలింగ్‌ ఆకట్టుకుంది. తన తొలి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన సైనీ... తర్వాత సైతం కట్టుదిట్టంగా బంతులేశాడు. అతడి నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా 19 డాట్‌ బాల్స్‌ ఉండటమే దీనికి నిదర్శనం. జట్టులో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసింది కూడా సైనీనే. అన్నింటికి మించి చివరి ఓవర్‌ను సైనీ వేసిన తీరు ముచ్చటగొలిపింది. పొలార్డ్‌ వంటి హిట్టర్‌కు వరుసగా రెండు డాట్స్‌ వేయడంతో పాటు మూడో బంతికి ఔట్‌ చేసి అతడి అర్ధసెంచరీని అడ్డుకున్నాడు. మిగతా మూడు బంతులకూ పరుగివ్వకుండా విండీస్‌ను 100లోపే పరిమితం చేశాడు. టి20ల్లో సాధారణంగా మెయిడిన్‌ వేయడమే అరుదంటే... ఏకంగా ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ను వికెట్‌ మెయిడిన్‌గా ముగించి భళా అనిపించాడు.   

తన అరంగేట్రపు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే సైనీ ఆకట్టుకోవడంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అరంగేట్రం మ్యాచ్‌లో ఈ తరహా అద్భుత ప్రదర్శన చేయడం అరుదుగా జరుగుతుందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కొనియాడాడు.  వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో సైనీ ప్రధాన పాత్ర పోషించాడన్నాడు. ఇక సహచర పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సైతం సైనీ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. తనలోని సత్తా ఏమిటో తొలి అంతర్జాతీయ టీ20లోనే నిరూపించుకున్నాడన్నాడు. ఈ వికెట్‌పై బౌలింగ్‌ చేయడం అంత ఈజీ కాదని, సైనీ మాత్రం తన అద్భుతమైన బౌలింగ్‌తో​ ఆకట్టకున్నాడన్నాడు.145-150కి.మీ వేగంతో బౌలింగ్‌ చేయడమంటే మాటలు కాదన్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మిగతా బౌలర్లలో ఆత్మవిశ్వాసం నింపాడన్నాడు. తనకు అవకాశం ఎక్కడ వచ్చినా దాన్ని నిలబెట్టుకుంటూనే సైనీ ముందుకు సాగుతున్నాడన్నాడు. అటు దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌, భారత్‌-ఎ మ్యాచ్‌ల్లో సైనీ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడని భువీ పేర్కొన్నాడు.

టెన్నిస్‌ బాల్‌తో క్రికెట్‌ మొదలుపెట్టి..

సైనీ క్రికెట్‌ కెరీర్‌ టెన్నిస్‌ బంతులతో ఆరంభమైంది. కర్మల్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ద్వారా అతని క్రికెట్‌ అరంగేట్రం జరిగింది.  సైనీ తండ్రి హర్యానా రాష్ట్రంలో ఒక డ్రైవర్‌గా పనిచేశాడు.  ఇదిలా ఉంచితే, 2013లో తొలిసారి సైనీని అదృష్టం తలుపు తట్టంది.  ఆ ఏడాది రంజీ ట్రోఫీలో ఢిల్లీ నెట్‌ బౌలర్‌గా బ్యాట్స్‌మన్‌కు బంతులు వేసే అవకాశం సైనీకి వచ్చింది. దాంతో అప్పటి భారత ఓపెనర్‌, ఢిల్లీ మాజీ కెప్టెన్‌ గౌతం గంభీర్‌కు నెట్‌ బౌలింగ్‌ చేశాడు. అతని బౌలింగ్‌లో వేగాన్ని గమనించిన గంభీర్‌.. ఆ సీజన్‌లో​ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. దాంతో పాటు ఆ సీజన్‌ ఆసాంతం ఓపెనింగ్‌ పేస్‌ అవకాశం రావడం మరొక విశేషం. విదర్భతో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో సైనీ రెండు వికెట్లతో మెరిశాడు. అలా తన ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ను ఆరంభించిన సైనీ.. ఇప్పుడు భారత్‌ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు సాధించడం అరుదైన ఘనతగా చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు