భారత్‌ శుభారంభం

14 May, 2018 04:19 IST|Sakshi

4–1తో జపాన్‌పై విజయం

నవ్‌నీత్‌ కౌర్‌ హ్యాట్రిక్‌

ఆసియా హాకీ చాంపియన్స్‌ ట్రోఫీ

డాంఘయీ సిటీ (కొరియా): మహిళల ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు శుభారంభం చేసింది. నవ్‌నీత్‌ కౌర్‌ ‘హ్యాట్రిక్‌’ గోల్స్‌తో చెలరేగడంతో తొలి మ్యాచ్‌లో జపాన్‌పై గెలుపొందింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సునీత లాక్రా బృందం 4–1తో ప్రపంచ 12వ ర్యాంకర్‌ జపాన్‌ను మట్టికరిపించింది. నవ్‌నీత్‌ కౌర్‌ (7వ, 25వ, 55వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌ సాధించింది. అనూప బర్లా (53వ ని.లో) మరో గోల్‌ నమోదు చేసింది. ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు జపాన్‌ డిఫెన్స్‌ను ఛేదించడంలో సఫలీకృతమైంది. జపాన్‌ తరఫున అకి యమదా (58వ ని.లో) ఏకైక గోల్‌ చేసింది. ‘తొలి మ్యాచ్‌ గెలవడం ఆనందంగా ఉంది. ఏ టోర్నీలోనైనా శుభారంభం ముఖ్యం. ఇదే జోరు కొనసాగిస్తాం. టైటిల్‌ గెలవడమే మా లక్ష్యం’ అని ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నవ్‌నీత్‌ పేర్కొంది. ఈనెల 16న జరిగే తదుపరి మ్యాచ్‌లో చైనాతో భారత్‌ ఆడతుంది.

>
మరిన్ని వార్తలు