కుమార్తెతో సహా బాస్కెట్‌బాల్‌ లెజెండ్‌ కోబ్‌ దుర్మరణం

27 Jan, 2020 08:34 IST|Sakshi

షాక్‌లో క్రీడా ప్రపంచం.. ట్రంప్‌, ఒబామా, కేటీఆర్‌ విచారం

కాలిఫోర్నియా: అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌, కోచ్‌ కోబ్‌ బ్రియాంట్‌ ఓ హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో బ్రియాంట్‌ కుమార్తె గియానాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం తన ప్రయివేట్‌ హెలికా​ప్టర్‌లో ప్రయాణిస్తున్న బ్రియాంట్‌ లాస్‌ఏంజిల్స్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని క్యాలబసస్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. హెలికాప్టర్‌ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలియాయి. ఇక ఈ ప్రమాదానికి గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

బ్రియాంట్‌ అకాల మరణంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాలు విచారం వ్యక్తం చేశారు. అమెరికా ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని, అతడు దేశంలో బాస్కెట్‌బాల్‌ అభివృద్దికి విశేషకృషి చేశాడని ప్రశంసించారు. అంతేకాకుండా అమెరికా క్రీడా చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు. వీరితో పాటు అమెరికన్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌(ఎన్‌బీఏ) సంతాపం తెలుపుతూ అతడి మరణం ఎన్‌బీఏకు తీరని లోటని తెలిపింది. ‘బ్రియాంట్‌, అతడి కుమార్తె మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యాను. ప్రపంచస్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు’ అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఇక ఈ దిగ్గజ ఆటగాడి మృతితో యావత్‌ క్రీడా ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ దిగ్గజ క్రీడాకారుడి మరణావార్త విని అమెరికా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. అక్కడి అన్ని టీవీ ఛానళ్ల న్యూస్‌ రీడర్లు అతడి మరణవార్తను తెలుపుతూ కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాకుండా అనేకచోట్ల అతడికి సంతాపం తెలుపుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు. 'బ్లాక్ మాంబా'గా బాస్కెట్ బాల్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఈ దిగ్గజ ఆటగాడు.. దాదాపు 20 ఏళ్లకు పైగా తన ఆటతో అభిమానులను అలరించాడు. అంతేకాకుండా అత్యధిక గోల్స్‌ సాధించిన టాప్‌ ప్లేయర్స్‌లలో కోబ్‌ బ్రియంట్‌ ఒకడిగా నిలిచాడు. 

మరిన్ని వార్తలు