మన జాతీయ జట్టు భిక్షాటన!

8 Apr, 2015 18:49 IST|Sakshi
మన జాతీయ జట్టు భిక్షాటన!

చదవడానికి కటవుగా అనిపించినా ఇది నిజం. క్రికెట్ కురిపించే కాసుల వేటలోపడ్డ ప్రభుత్వాలు, క్రీడా సంస్థలు మిగతా క్రీడల్ని నిర్లక్ష్యం చేసినంత పచ్చి వాస్తవం. ఇంటర్నేషనల్ ఐస్ హాకీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 18 నుంచి కువైట్లో ఆసియా కప్ చాలెంజర్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో భారత జట్టుకూడా పాల్గొంటోంది. అయితే ఖతార్ వెళ్లేందుకుగానీ,  ప్రిపరేషన్ క్యాంప్ నిర్వాహణకుగానీ క్రీడా మంత్రిత్వశాఖ ఒక్కపైసా నిధులివ్వలేదు!

దీంతో ఐస్ హాకీ జట్టులోని 11 మంది ఆటగాళ్లు తమ స్థోమతకు తగ్గట్టు తలా 20 వేలు వేసుకొని  రెండు లక్షల రూపాయలు పోగుచేశారు. ఖతార్ టూర్కు మొత్తం రూ. 12 లక్షలు ఖర్చవుతాయి. మిగతా రూ. 10 లక్షలు సేకరించేందుకు సోషల్ నెట్వర్క్ సైట్ల ద్వారా ప్రజలకు విజ్ఞాపనలు పంపారు. స్పందించిన దయార్థహృదయులు కొందరు ఓ ఐదు లక్షల రూపాయల వరకు సమకూర్చగలిగారు. ఇకా రూ.7 లక్షలు పోగైతేగానీ ఆసియా కప్లో ఆడలేదు మన భారత ఐస్ హాకీ జట్టు! 'చందాలు స్వీకరించడాన్ని అవమానంగా భావించట్లేదు. ఈ రోజు మేం చేస్తోన్న ప్రయత్నం భవిష్యత్లోనైనా ప్రభుత్వాలు, క్రికెట్ను మాత్రమే వెర్రిగా ప్రేమించే అభిమానుల కళ్లు తెరిపిస్తాయని ఆశిస్తున్నాం' అని ఓ ఐస్ హాకీ ఆటగాడు అన్నారు.

ఐస్ హాకీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. 1989లోనే ఇంటర్నేషనల్ ఐస్ హాకీ ఫెడరేషన్ గుర్తింపు పొందింది. మొదటి నుంచి క్రీడా మంత్రిత్వశాఖ నిరాదరణకు గురైన ఈ సంస్థ.. అనేక ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ తన ప్రస్థానాన్ని సాగిస్తోంది. నిధులు సమకూర్చుకోలేని సందర్భాల్లో జాతీయ జట్టును ఆయా టోర్నమెంట్లకు పంపని సందర్భాలు కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తలు