తొలి స్వదేశీ వన్డేలో ఓటమి

6 Feb, 2020 15:09 IST|Sakshi

ఖాట్మండు; ముక్కోణపు సిరీస్‌లో భాగంగా తమ సొంత గడ్డపై ఆడిన అధికారిక తొలి వన్డేలోనే నేపాల్‌ ఓటమి పాలైంది.  నేపాల్‌ వేదికగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిర్వహిస్తున్న ట్రై సిరీస్‌లో ఆ దేశంతో పాటు అమెరికా, ఒమన్‌లు తలపడుతున్నాయి. దీనిలో భాగంగా ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్‌ 18 పరుగుల తేడాతో పరాజయం చెందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేయగా, నేపాల్‌ 179 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఒమన్‌ మిడిల్‌ ఆర్డర్‌ ఆటగాడు మహ్మద్‌ నదీమ్‌ ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 96 బంతుల్లో అజేయంగా 69 పరుగులు సాధించాడు. ఇక నేపాల్‌ జట్టు శరద్‌ విశ్వాకర్‌ 55 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. 

కాగా, తమ దేశం తొలిసారి అధికారిక వన్డే సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వడంపై నేపాల్‌ కెప్టెన్‌ జ్ఞానేంద్ర మల్లా సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తమ దేశం మొత్తం గర్వించే క్షణమన్నాడు. తాము క్రికెట్‌ ఆడుతున్నప్పట్నుంచీ ప్రతీ ఒక్కరరూ వన్డే హోదా రావాలని కోరుకున్నారని, ఇప్పుడు అతి పెద్ద క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నారన్నాడు. స్వదేశంలో జట్టుకు కెప్టెన్‌గా ఉండి మ్యాచ్‌ ఆడటం సరికొత్త అనుభూతిని తీసుకొచ్చిందన్నాడు. ఖాట్మాండు తమ ఫేవరెట్‌ గ్రౌండ్లలో ఒకటని తెలిపాడు. 2018లో నేపాల్‌కు వన్డే హోదా దక్కిన సంగతి తెలిసిందే.  ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీలో మెరుగైన స్థానాల్లో నిలవడం ద్వారా నేపాల్‌తో పాటు స్కాట్లాండ్‌,యూఏఈలు వన్డే హోదా సాధించాయి. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా