వాడియాపై చర్చించనున్న సీఓఏ  

2 May, 2019 00:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియాపై శుక్రవారం ముంబైలో జరుగనున్న సమావేశంలో క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ) చర్చించనుంది. వాడియా... ఇటీవల జపాన్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. దీంతో అక్కడి కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత ఈ శిక్షను ఐదేళ్ల పాటు సస్పెండ్‌ చేశారు. ఐపీఎల్‌ నైతిక నియమావళి ప్రకారం... ఫ్రాంచైజీలతో సంబంధం ఉన్న ఏ వ్యక్తి కూడా ఆటకు అపకీర్తి తెచ్చే విధంగా వ్యవహరించకూడదు. గతంలో రాజస్తాన్‌ రాయల్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీల సంబంధీకులు స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో అభియోగాలు ఎదుర్కొన్నందుకు చర్యలకు గురయ్యారు. మరోవైపు వాడియా వ్యవహారం ఇప్పటివరకు ఐపీఎల్‌ నైతిక విలువల కమిటీ ముందుకు రాలేదు.

శుక్రవారం సమావేశంలో దీనిని చర్చించి ముగ్గురు సభ్యుల ఆఫీస్‌ బేరర్ల బృందానికి కానీ, సుప్రీం కోర్టు నియమిత అంబుడ్స్‌మన్‌–ఎథిక్స్‌ అధికారి జస్టిస్‌ డీకే జైన్‌కు కానీ నివేదించనున్నట్లు తెలుస్తోంది. బహుశా, అంబుడ్స్‌మన్‌కే ఈ బాధ్యత అప్పగిస్తారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ‘పంజాబ్‌పై నిషేధం’ ఊహాగానమేనని పేర్కొన్న ఆయన... ఘటనతో ఐపీఎల్‌కు నేరుగా సంబంధం లేదనే విషయాన్ని ప్రస్తావించారు. లీగ్‌కు ఇబ్బంది అని భావిస్తేనే చర్యలుంటాయని వివరించారు. బీసీసీఐ న్యాయ బృందం, అంబుడ్స్‌మన్‌ దీనిపై చర్చిస్తుందని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు