నెదర్లాండ్స్‌కు జర్మనీ ఝలక్‌

6 Dec, 2018 01:32 IST|Sakshi

రెండో విజయంతో క్వార్టర్స్‌కు చేరువ

భువనేశ్వర్‌: రెండు మాజీ చాంపియన్స్‌ జట్లు జర్మనీ, నెదర్లాండ్స్‌ మధ్య హోరాహోరీగా సాగుతుందనుకున్న పోరు ఏకపక్షంగా ముగిసింది. ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో జర్మనీ వరుసగా రెండో విజయంతో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌కు చేరువైంది. ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ నెదర్లాండ్స్‌తో జరిగిన పూల్‌ ‘డి’ మ్యాచ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ జర్మనీ 4–1 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి క్వార్టర్‌లోని 13వ నిమిషంలో వాలెంటిన్‌ వెర్గా గోల్‌తో నెదర్లాండ్స్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే రెండో క్వార్టర్‌లోని 30వ నిమిషంలో మథియాస్‌ ముల్లర్‌ గోల్‌తో జర్మనీ 1–1తో స్కోరును సమం చేసింది. మూడో క్వార్టర్‌లో రెండు జట్లు గోల్స్‌ చేయలేదు. ఇక చివరిదైన నాలుగో క్వార్టర్‌లో జర్మనీ చెలరేగింది. ఆరు నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్‌ చేసి నెదర్లాండ్స్‌కు షాక్‌ ఇచ్చింది. 52వ నిమిషంలో విండ్‌ఫెడర్‌... 54వ నిమిషంలో మార్కో మిల్ట్‌కౌ... 58వ నిమిషంలో క్రిస్టోఫర్‌ ఒక్కో గోల్‌ చేసి జర్మనీ విజయాన్ని ఖాయం చేశారు. చివరిసారి 2002 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించిన తర్వాత ఆ జట్టుపై జర్మనీ మళ్లీ నెగ్గడం ఇదే తొలిసారి. 2006, 2010 ప్రపంచకప్‌లలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగి యగా... 2014 ప్రపంచకప్‌లో జర్మనీపై నెదర్లాండ్స్‌ 1–0తో గెలిచింది.  

పాక్, మలేసియా మ్యాచ్‌ ‘డ్రా’ 
పూల్‌ ‘డి’లోని మరో మ్యాచ్‌లో నాలుగుసార్లు చాంపియన్‌ పాకిస్తాన్‌ ‘డ్రా’తో సరిపెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో 0–1తో జర్మనీ చేతిలో ఓడిన పాక్‌... మలేసియాతో జరిగిన రెండో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. పాక్‌ తరఫున అతీక్‌ మొహమ్మద్‌ (51వ నిమిషంలో), మలేసియా తరఫున ఫైజల్‌ (55వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు.  గురువారం జరిగే పూల్‌ ‘ఎ’ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌తో స్పెయిన్‌; ఫ్రాన్స్‌తో అర్జెంటీనా తలపడతాయి. 

>
మరిన్ని వార్తలు