ఆ క్రికెటర్‌ను గాయపర్చడం ఎంతో ఇష్టం: అక్తర్

28 Jul, 2017 17:36 IST|Sakshi
ఆ క్రికెటర్‌ను గాయపర్చడం ఎంతో ఇష్టం: అక్తర్

ఇస్లామాబాద్: క్రికెట్ ప్రపంచంలో ఫాస్ట్‌బౌలర్లలో పాకిస్తాన్ ప్లేయర్, 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌'గా పేరుగాంచిన షోయబ్‌ అక్తర్‌ ఒకడు. గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు సంధిస్తూ దిగ్గజ క్రికెటర్లను సైతం పలుమార్లు గాయాలపాలు చేసేవాడు అక్తర్. ఇంకా చెప్పాలంటే అతడి కెరీర్‌లో దాదాపు 19 మంది బ్యాట్స్‌మెన్‌ గాయపడి డ్రెస్సింగ్ రూముకు వెళ్లిపోయారట. క్రికెట్‌ హిస్టరీలోనే అంతమంది క్రికెటర్లను రిటైర్డ్‌ హర్ట్‌గా పంపించిన బౌలర్‌ అతడే కావడం అక్తర్ బౌలింగ్ దాడిని తెలుపుతుంది. క్రికెట్ నుంచి రిటైరైన చాలా రోజుల తర్వాత పాక్ ప్లేయర్ కొన్ని విషయాలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.

ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్లను గాయపర్చడం తనకెంత మాత్రం ఇష్టం ఉండదని అక్తర్‌ తెలిపాడు. అయితే తన కెరీర్‌లో ఒక క్రికెటర్‌ను మాత్రం గాయపర్చాలని తాపత్రయ పడేవాడినని వెల్లడించాడు. ఆ బ్యాట్స్‌మెన్ మరోవరో కాదు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్. 'బ్యాట్స్‌మెన్లను గాయపర్చడం నాకు ఇష్టం ఉండదు. కానీ మాథ్యూ హెడేన్‌ను మాత్రం గాయాలపాలు చేయడం నాకిష్టం. ప్రాక్టీస్ మ్యాచ్‌లు, టెస్లులలో ఎన్నోసార్లు అనుకున్నది సాధించాను. ప్రస్తుతం మాత్రం మేమిద్దరం మంచి మిత్రులమని' తన ట్వీట్‌లో అక్తర్ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు