-

నేను ఎప్పుడూ ఊహించనే లేదు: పాంటింగ్‌

16 Mar, 2019 11:48 IST|Sakshi

ముంబై: ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌, భారత ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌లు ఫ్రెండ్స్‌గా మారిపోతారంటే ఎవ్వరూ ఊహించి ఉండరు. దీనిపై పాంటింగ్ సైతం ఆశ్చర్యం వక్తం చేశాడు. హర్భజన్‌తో తనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుందని తాను ఏనాడు ఊహించనే లేదని తాజాగా పేర్కొన్నాడు. కేవలం ఐపీఎల్‌ కారణంగా భజ్జీతో స్నేహం ఏర్పడిందని, అది తమ మధ్య స్నేహ బంధాన్ని మరింత పెంచిందన్నాడు. దేశాల మధ్య విదేశీ ఆటగాళ్ల మధ్య ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడటానికి ఐపీఎల్‌ చక్కని వేదికగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదని రికీ పాంటింగ్‌ స్పష్టం చేశాడు.

2008లో ఆసీస్‌-భారత జట్ల మధ్య జరిగిన సిరీస్‌ సందర్భంగా చోటు చేసుకున్న మంకీ గేట్‌ వివాదం ఇరు దేశాల క్రికెటర్ల మధ్య విభేదాలకు దారి తీసింది. ఆనాటి సిడ్నీ టెస్టులో తనను హర్భజన్‌ మంకీ అంటూ కించపరిచాడని ఆండ్రూ సైమండ్స్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.  ఈ వివాదం తర్వాత అప్పటి ఆసీస్‌ జట్టులో సభ్యులుగా ఉన్న రికీ పాంటింగ్‌, మాథ్యూ హేడెన్‌, సైమండ్స్‌, మైకేల్‌ క్లార్క్‌లు హర్భజన్‌తో సఖ్యత ఉండేవారు కాదు. కనీసం భజ్జీని చూసేందుకు సైతం వారు ఇష్టపడేవారు కాదు.  కాగా, ఆ తర్వాత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) రావడంతో పాంటింగ్‌-హర్భజన్‌ల మధ్య స్నేహం ఏర్పడింది. ఆటగాడిగా, కోచ్‌గా దాదాపు నాలుగేళ్ల పాటు ముంబై ఇండియన్స్‌తో పాంటింగ్‌ పని చేయగా, అదే సమయంలో భజ్జీ కూడా ముంబై జట్టుకు ప్రాతినిథ్య వహించడంతో వారి మధ్య సఖ్యత పెరగడానికి కారణమైంది.

మరిన్ని వార్తలు