నాయకులొచ్చారు..!

12 Jan, 2015 00:31 IST|Sakshi
నాయకులొచ్చారు..!

భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఫలితాలు, రికార్డుల సంగతి పక్కన పెడితే అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన అంశం ఇరు జట్ల కెప్టెన్లు, వారి వ్యూహ ప్రతివ్యూహాలు. ఇద్దరి వయసు, వారు నాయకత్వం అందుకున్న పరిస్థితులు, ముందుండి జట్టును నడిపించిన తీరు... ఇలా అన్ని అంశాల్లో వారి మధ్య పోలికలు కనిపిస్తాయి. ఆరేళ్ల క్రితమే అండర్-19 ప్రపంచ కప్‌ను గెలిపించి కోహ్లి తన నాయకత్వ పటిమను ప్రదర్శిస్తే, అదే టోర్నీ లో ఆల్‌రౌండర్‌గా స్టీవెన్ స్మిత్ తనకంటూ తొలిసారి గుర్తింపు దక్కించుకున్నాడు.
 
 భారత్‌కు టెస్టు కెప్టెన్‌గా తన స్థానం పదిలపర్చుకున్న కోహ్లి... ధోని వైదొలగిన తర్వాత ఇతర ఫార్మాట్‌లలోనూ ‘సహజ నాయకుడు’గా ముందుకు రావడం ఖాయం. అదే విధంగా గాయంతో క్లార్క్ కెరీర్ సందిగ్ధంలో పడిన నేపథ్యంలో మూడు ఫార్మాట్‌లలోనూ సభ్యుడైన స్టీవెన్ స్మిత్ కూడా ఇకపై జట్టును పూర్తి స్థాయిలో నడిపించవచ్చు. రాబోయే కొన్నేళ్లు వీరిద్దరు కెప్టెన్లుగా తమ జట్లను శాసించడం ఖాయం.
 
 కెరీర్ తొలి వన్డే మ్యాచ్‌లోనే ఒక 20 ఏళ్ల కుర్రాడు పాంటింగ్‌లాంటి దిగ్గజ కెప్టెన్‌కు వ్యూహాల విషయంలో సలహాలివ్వగలడా... ఇచ్చినా తాను చెప్పినట్లుగా ఫీల్డింగ్ పెట్టేలా ఒప్పించగలడా... కానీ స్టీవెన్ స్మిత్ మాత్రం అదే చేశాడు. అప్పుడే అతనిలోని నాయకత్వ లక్షణాలు ఆస్ట్రేలియన్లకు ఆకట్టుకున్నాయి. సాధారణ లెగ్‌స్పిన్నర్, అవసరమైతే కొంత బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన స్మిత్ పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గా, ఇప్పుడు కెప్టెన్‌గా తనను తాను మలచుకున్న తీరు అసాధారణం.

కోహ్లిలాగా స్మిత్ అంతర్జాతీయ ప్రస్థానం సాఫీగా సాగలేదు. ఎన్నో సార్లు జట్టులోకి వచ్చాడు, పోయాడు. ముందు టి20 స్పెషలిస్ట్‌గా, ఆ తర్వాత వన్డే ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న స్మిత్, టెస్టు బ్యాట్స్‌మన్‌గా అద్భుతమైన ఆటతీరు కనబర్చడం విశేషం. ఎంతో మంది దిగ్గజాలకు సాధ్యం కాని రీతిలో వరుసగా నాలుగు టెస్టుల్లో సెంచరీలు, మొత్తం 769 పరుగులు చేసిన అతను... కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే  బ్యాట్స్‌మన్‌గా, ఫీల్డర్‌గా (రోహిత్ శర్మ క్యాచ్) గతంలోని ఆసీస్ కెప్టెన్లకంటే ఎంతో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. బ్రిస్బేన్ టెస్టులో అతని నాయకత్వ పటిమతోనే ఆసీస్‌కు అనూహ్య విజయం దక్కింది.

మెల్‌బోర్న్ టెస్టులో డిక్లరేషన్ ఆలస్యం చేశాడని విమర్శలు వచ్చినా, అడిలైడ్‌లో ఆ తప్పు సరిదిద్దుకున్నాడు. ఇక చాలా మంది వ్యక్తిగత రికార్డులు అంటే పడి చచ్చే చోట జట్టు ముఖ్యమంటూ 192 పరుగుల వద్ద ర్యాంప్ షాట్ ఆడి అవుట్ కావడం అతని ధైర్యానికి మెచ్చుతునక. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఉండే సహజమైన దూకుడు స్మిత్‌లో ఉన్నా, సిరీస్ ఆసాంతం నోటి మాటలతో ఎక్కడా వివాదాస్పదం కాకపోవడం కోహ్లికంటే అతడిని ఒక మెట్టు ముందుంచుతుంది.

ఏ సిరీస్‌లో ఫలితం ఎలా ఉన్నా... కంగారూలకు యాషెస్ అంటేనే ప్రాణం లేచొస్తుంది. ఈ ఏడాది యాషెస్ రూపంలో అతనికి పెను సవాల్ ముందుంది. యువ కెప్టెన్‌గా జట్టును సమర్థంగా నడిపించగల, గెలిపించగల సత్తా స్మిత్‌లో ఉందని ఆసీస్ అభిమానులు నమ్ముతున్నారు. అదే జరిగితే ఆసీస్ దిగ్గజాలలో అతని పేరు తప్పకుండా చేరుతుంది.
 
 ‘కెప్టెన్‌గా మీరు సాధించిన విజయాల తర్వాతే మీకు అమిత గౌరవం దక్కింది. నేనూ ప్రత్యర్థి జట్లనుంచి అదే కోరుకుంటున్నాను. మీలాగే నేనూ అలాంటి విజయాలు సాధిస్తాను’... సిడ్నీ టెస్టు తర్వాత సౌరవ్ గంగూలీతో కోహ్లి చెప్పిన మాట ఇది. ఈ సిరీస్ రెండు టెస్టులలో అతని ఆలోచనలు, కెప్టెన్‌గా వ్యవహరించిన తీరు చూస్తే కోహ్లి ఇలాంటి వ్యాఖ్య చేయడం ఆశ్చర్యం కలిగించదు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై భారత దిగ్గజ ఆటగాళ్లంతా ప్రతీ పరుగు కోసం శ్రమిస్తున్న చోట సిరీస్‌లో ఏకైన సెంచరీ చేసిన తర్వాత కూడా టెస్టు బ్యాట్స్‌మన్‌గా కోహ్లి సామర్థ్యంపై సందేహాలు పూర్తిగా తొలగిపోలేదు.

ఇంగ్లండ్ సిరీస్‌లో ఘోర వైఫల్యం మరోసారి కోహ్లిని ఇబ్బందుల్లో పడేసింది. అయితే అదే ఆస్ట్రేలియాలో కెప్టెన్‌గా మాత్రం అతను ఒక్కసారిగా ఆకట్టుకున్నాడు. అడిలైడ్ టెస్టులో చేసిన రెండు సెంచరీలు, ఆ మ్యాచ్ చివరి రోజు ‘డ్రా’ కోసం కాకుండా గెలుపు కోసం ప్రయత్నించడం, అశ్విన్‌ను కాదని కరణ్ శర్మకు అవకాశం ఇవ్వడం కోహ్లిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. చివరి టెస్టులోనైతే మరో ద్రవిడ్‌లాంటి పుజారాను కూడా పక్కనపెట్టి అతను రైనాతో రిస్క్ చేశాడు. ఆఖరి రోజు కూడా అడిలైడ్‌లాగే ఊరిస్తున్నా... వాస్తవ పరిస్థితిని అంచనా వేసి వ్యూహం మార్చడంలో అతని పరిణతి కనిపించింది.

ఇక బ్రిస్బేన్‌లో కెప్టెన్ కాకపోయినా, జాన్సన్ సహా ఇతర ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అంటూ ఎదురు నిలబడటం కోహ్లిని ఆస్ట్రేలియాలో కూడా స్టార్‌గా మార్చేసింది. ఆటతోపాటు మాటల్లో కూడా  దూకుడు కనిపించింది. నాలుగు సెంచరీలు సహా 692 పరుగులతో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన అతను నాయకుడిగా కూడా జట్టును సమర్థంగా నడిపించగలిగాడు. బలహీనమైన బౌలింగ్ కీలక సమయాల్లో అండగా నిలవకపోయినా... విభిన్న వ్యూహాలతో చాలా సందర్భాల్లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో విరాట్ కోహ్లి సఫలమయ్యాడు. సెంచరీ పూర్తయ్యాక అతను లోకేశ్ రాహుల్‌ను ప్రేమగా కౌగిలించుకొని అభినందించిన దృశ్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. సిరీస్ గెలవకపోయినా, కుర్రాళ్లను ప్రోత్సహిస్తూ, వారిని తగిన విధంగా మలచుకున్న తీరు, నేనున్నానంటూ అతను కల్పించిన భరోసా భారత క్రికెట్ భవిష్యత్తు భద్రమని చెప్పకనే చెబుతోంది.

మరిన్ని వార్తలు