కివీస్‌ విజయం

9 Jun, 2019 05:52 IST|Sakshi
నీషమ్, గప్టిల్‌

టాంటన్‌: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ వరుసగా మూడో విజయం సాధించి ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. అఫ్గానిస్తాన్‌తో శనివారం జరిగిన డేనైట్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 7 వికెట్ల తేడాతో గెలిచింది. అఫ్గానిస్తాన్‌ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 32.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అధిగమించింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ (99 బంతుల్లో 79 నాటౌట్‌; 9 ఫోర్లు), రాస్‌ టేలర్‌ (52 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. అంతకుముందు న్యూజిలాండ్‌ పేస్‌కు అఫ్గానిస్తాన్‌ తలవంచింది. నీషమ్‌ (5/31), ఫెర్గుసన్‌ (4/37) నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 41.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది.

తొలుత ఓపెనర్లు హజ్రతుల్లా (34; 5 ఫోర్లు, 1 సిక్స్‌), నూర్‌ అలీ (31; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. కానీ అదే స్కోరు వద్ద ఓపెనర్లతో పాటు రహ్మత్‌ షా (0) ఔటయ్యారు. తర్వాత 4 పరుగుల వ్యవధిలో కెప్టెన్‌ గుల్బదిన్‌ నైబ్‌ (4) కూడా చేతులెత్తేయడంతో 70 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో హష్మ తుల్లా (59; 9 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. సహచరులు నబీ (9), నజీబుల్లా (4), ఇక్రమ్‌ (2), రషీద్‌ (0) ఇలా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన బ్యాట్స్‌మెన్‌తో కలిసి అర్ధసెంచరీ చేశాడు.

 

మరిన్ని వార్తలు