విజయంతో మెకల్లమ్ కు వీడ్కోలు

8 Feb, 2016 15:32 IST|Sakshi
విజయంతో మెకల్లమ్ కు వీడ్కోలు

హామిల్టన్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. సోమవారం ఇక్కడ ఇరు జట్ల మధ్య జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా  సిరీస్ ను చేజిక్కించుకున్న కివీస్ ఆ జట్టు స్టార్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ కు ఘనమైన వీడ్కోలు ఇచ్చినట్లయ్యింది.

 

తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయాల్సిందిగా కివీస్ ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కివీస్ 45.3 ఓవర్లలో 246 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో చివరి వన్డే ఆడిన మెకల్లమ్(47; 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తనదైన శైలిలో చెలరేగగా,  గప్టిల్(59;61 బంతుల్లో 4 ఫోర్లు,3 సిక్సర్లు) రాణించాడు. ఆ తరువాత ఎలియట్(50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, కోరీ అండర్సన్(27) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచకల్గింది.

అనంతరం సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 191 పరుగులకే చాపచుట్టేసి ఓటమి పాలైంది. ఉస్మాన్ ఖాజా(41), జార్జ్ బెయిలీ(33), మిచెల్ మార్ష్(41) మినహా ఎవరూ ఆడకపోవడంతో ఆసీస్ కు ఓటమి తప్పలేదు.  న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ మూడు వికెట్లు తీయగా,కోరీ అండర్సన్, సోథీలకు తలో రెండు వికెట్లు లభించాయి. తొలి వన్డేలో న్యూజిలాండ్ గెలవగా, రెండో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు